పాడు యుద్దం.. వాటర్ బాటిల్ రేట్లకు రెక్కలు
ఇప్పుడు తాగునీటి వాటర్ బాటిళ్ల మీద కూడా యుద్ధ భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.;
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరగటం ఏమిటి? దాని ఫలితం సగటుజీవి కొనే ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ మీద పడటం ఏమిటి? అవును.. తాజా యుద్ధం ఇప్పటికే మన దేశంలోని ప్రతి ఇంటిని తాకింది. వంటింటి గ్యాస్ బండ మీద ఇప్పటికే ప్రభావం పడటం.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పెద్ద ఎత్తున టిఫిన్ సెంటర్లు.. హోటళ్లు.. రెస్టారెంట్లు ఎఫెక్టు కావటం తెలిసిందే. దేశంలో 70 రోజులకు పైనే చమురు నిల్వలు ఉన్నాయని.. పెట్రోల్, డీజిల్ కొరత వచ్చే అవకాశం లేదని కేంద్రం చెబుతున్నారు. అయినప్పటికి సామాన్యుడి మదిలో భయాందోళనలతో నిండి.. ముందు జాగ్రత్తలో భాగంగా ట్యాంకులు ఫుల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాగునీటి వాటర్ బాటిళ్ల మీద కూడా యుద్ధ భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వత.. కొనుగోలు చేసే వాటర్ బాటిళ్ల వ్యాపారం దేశ వ్యాప్తంగా ఎంతన్న విషయాన్ని లెక్కేస్తే.. ఆశ్చర్యపోయే గణాంకాలు తెర మీద కనిపిస్తాయి. అవును.. మన దేశంలో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్ అక్షరాల రూ.46వేల కోట్లకు పైనే. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న బాటిల్ వాటర్ మార్కెట్లలో మన దేశం ఒకటి. ప్లాస్టిక్ సీసాల తయారీలో పాలిమర్ చాలా కీలకం. దీన్ని ముడి చమురు నుంచి తయారు చేస్తారు. చమురు ధరలు పెరగటంతో పాలిమర్ ధరలూ పెరిగాయి. సీసాల తయారీలో వాడే ముడిపదార్థం ధర యాభై శాతం పెరిగి కిలోకు రూ.170కు చేరగా.. సీసా మూతల ధర రెట్టి కంటే ఎక్కువైంది. ఒక్కొక్కటి 45 పైసలకు చేరినట్లుగా మార్కెట్ వర్గాలు పెబుతున్నారు.
ప్రస్తుతానికి రిటైల్ మార్కెట్ మీద ప్రభావం లేదు కానీ.. ఇదే తీరులో యుద్దం సాగితే మాత్రం.. వాటర్ బాటిళ్ల ధరల్ని పెంచటం ఖాయమంటున్నారు. దీనికి సంబంధించిన స్పష్టత మరో వారంలో ఖాయమంటున్నారు. మన దేశంలో 70 శాతం భూగర్భ జలాలు.. పైపులైన్లలో వచ్చే నీరు కలుషితమై ఉన్నటలు పరిశోధకులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చే చాలు.. బాటిల్ వాటర్ మీద ఆధారపడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉన్న కంపెనీలకు తోడుగా ఇప్పుడు ఈ మార్కెట్ లో టాటా -రిలయన్స్ లు అధిపత్యం కోసం పోటీ పడుతున్న పరిస్థితి. ఇదంతా చదివిన తర్వాత పాడు యుద్ధం త్వరగా ముగిస్తే బాగుండని అనుకోకుండా ఉండలేం.