తెలంగాణాకు కేసీఆర్ మరణ శాసనం!

తెలంగాణా తొలి సీఎం గా వచ్చిన కేసీఆర్ ఈ విషయం మీద పోరాడాల్సింది పోయి 299 టీఎంసీలకు అంగీకరించడమేంటని ఆయన ప్రశ్నించారు.;

Update: 2026-01-03 18:30 GMT

నిజానికి చూస్తే ఇది అత్యంత తీవ్రమైన విమర్శ. ఒక విధంగా పదేళ్లు తెలంగాణాకు సీఎం గా పనిచేసి తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమించిన కేసీఆర్ వంటి నాయకుడి దక్షత నిబద్ధత మీద వేసిన పదునైన ప్రశ్న. నీరు, నిధులు నియామకాలు అన్న అంశాలనే ముందు పెట్టుకుని తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు. పద్నాలుగేళ్ళ పాటు ఉద్యమాన్ని నడిపించారు. అలా కేసీఆర్ తెలంగాణా జాతి పితగా తన పార్టీ వారి చేత మెప్పులు పొందారు. మరి కేసీఆర్ హయాంలోనే నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది అంటే అది నిజంగా బీఆర్ఎస్ పునాదుల మీదనే కుదుపు లాంటి వార్త. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఈ మాట అంటున్నారు. ఏకంగా నిండు సభలో ఆయన కేసీఆర్ మీద అతి పెద్ద విమర్శను సైతం చేశారు.

కేసీఆర్ అంగీకారం :

కృష్ణా బేసిన్ లో తెలంగాణా ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని రేవంత్ రెడ్డి సభకు తెలిపారు. అయితే రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు చివరి సీఎం గా పనిచేసిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ కేటాయింపులను తెలంగాణాకు కేవలం 299 గా పేర్కొంది అని ఆయన గుర్తు చేశారు. ఇక ఆనాడు ఈ ఎన్ సీ గా ఉన్న మురళీధర్ రావు కూడా తెలంగాణాకు 299 టీఎంసీలు అని ఒక తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన చెప్పారు. అలా మొత్తం విషయం ఉంటే కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎం అయిన తర్వాత 490 టీఎంసీల కోసం పోరాడకుండా 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేశారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. దాని ఫలితంగా ఆ అంగీకారం తెలంగాణాకు ఒక రకంగా మరణ శాసనం అయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పోరాడాల్సిన వేళ :

తెలంగాణా తొలి సీఎం గా వచ్చిన కేసీఆర్ ఈ విషయం మీద పోరాడాల్సింది పోయి 299 టీఎంసీలకు అంగీకరించడమేంటని ఆయన ప్రశ్నించారు. మరి ఈ విధంగా చేయడం ఏ మేరకు సబబు అని ఆయన అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ నిలదీశారు. అయితే ఈ విషయం మీద బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో తెలియదు, అయితే రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా ఈ విషయం మీద మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణాకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమే అని కూడా స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. దానికి సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను గణాంకాలను ఆయన వివిధ వేదికల మీద పెట్టి మరీ బీఆర్ఎస్ ని కార్నర్ చేస్తున్నారు. అయితే దీనిని ధీటైన జవాబు అయితే బీఆర్ ఎస్ నుంచి రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే ఏ నీటి కోసం అయితే తీరని అన్యాయం జరిగింది అని తెలంగాణా ఏపీ నుంచి విడిపోయిందా ఇదే అంశం మీద ఎంత రచ్చ చేయాలో అంతా చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ హయాంలోనే తెలంగాణాకు నీటి విషయంలో నోట్లో మన్ను పడింది అని కాంగ్రెస్ అంటున్న దానికి జనాలు కూడా తమదైన శైలిలో రియాక్ట్ అవుతారు అని అంటున్నారు.

Tags:    

Similar News