స్టాలిన్...విజయ్..మధ్యలో కాంగ్రెస్

తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా ఉండబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది అంటున్నారు.;

Update: 2026-01-04 04:00 GMT

తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా ఉండబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది అంటున్నారు. ఈ ఏడాది మే నెలలో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండోసారి గెలిచి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే చూస్తోంది. ఇక డీఎంకే కూటమిలో కాంగ్రెస్ వామపక్షాలు ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో ఈ పార్టీలు అన్నీ కలసి అత్యధిక సీట్లను గెలుచుకున్నాయి. ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ భావిస్తున్నారు. అయితే అయిదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో యాంటీ ఇంకెంబెన్సీ అన్నది ఉండబోతోంది. దాంతో పాటుగా కొత్తగా సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ కూడా దూసుకుని వస్తోంది. ఇక బీజేపీ అన్నాడీఎంకే కూడా ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఓట్ల చీలిక వల్ల ఎవరికి లాభం అన్నది కూడా తెలియడం లేదు అని విశ్లేషణలు ఉన్నాయి.

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా :

తమిళనాడులో స్టార్ హీరోగా ఎంతో పాపులారిటీ కలిగిన విజయ్ టీవీకే పార్తీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈసారి ఎన్నికల్లో ఉండబోతోంది అని అంటున్నారు. విజయ్ పార్టీతో చెలిమి కోసం బీజేపీ అన్నా డీఎంకే చేయని ప్రయత్నాలు లేవు, గత ఏడాది అక్టోబర్ లో విజయ్ సభలో 40 మందికి పైగా జనాలు చనిపోవడంతో ఆ ఘటన మీద విజయ్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో బీజేపీ అన్నా డీఎంకే మద్దతుగా నిలిచాయి. అయితే టీవీకే అయితే మొదటి నుంచి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటోంది. ద్రవిడ భావజాలంతోనే ఆ పార్టీ ముందుకుస్ సాగుతోంది. పైగా తమిళనాడులో ద్రవిడ భావజాలం బలంగా లేదని దానిని కొనసాగించే విషయంలో డీఎంకే అన్నా డీఎంకే రెండూ ఫెయిల్ అయ్యాయన్నది టీవీకే ప్రధాన విమర్శగా ఉంది. దాంతో బీజెపేఎ అన్నా డీఎంకే కూటమి వైపు టీవీకే చేరేది ఉండదని ఆంతా అనుకుంటున్నారు.

అనూహ్యంగా కాంగ్రెస్ :

అయితే ఇపుడు మరో కొత్త విషయం చర్చకు వస్తోంది. అదేంటి అంటే టీవీకే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ఉంది. తమిళనాడులో డీఎంకే తో కాంగ్రెస్ ఉంది. మరి విజయ్ పార్టీ టీవీకేకి దీనిలో ఎక్కడ చోటు అన్న ప్రశ్న అయితే ఉండనే ఉంది. కానీ రాజకీయాల్లో కాదేదీ అనర్హం అన్నట్లుగా ఇపుడు టీవీకే పార్టీ ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి రావడం కష్టమన్న ఆలోచన కూడా ఆ పార్టీకి ఉంది. దాంతో జాతీయ స్థాయిలో విపక్షంలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తో చేతులు కలిపితే ఎలా ఉంటుంది అన్నదే టీవీకే ప్రస్తుతం సాగుతున్న చర్చగా చెబుతున్నారు.

కీలక వ్యాఖ్యలతో :

ఇక టీవీకే జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న గెరాల్డ్ తాజాగా చేసిన కీలక వ్యాఖ్యలే దీనిని సంకేతం అని అంటున్నారు. ఆయన టీవీకే కాంగ్రెస్ సహజ మిత్రులు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. రెండు పార్టీలూ లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నాయని కూడా ఆయన చెబుతూనే మతతత్వానికి తాము వ్యతిరేకమని బీజేపీకి పరోక్షంగా దూరం అన్నట్లుగా చెప్పేశారు. అంతే కాకుండా తమ నాయకుడు విజయ్ అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంచి మిత్రులు అని కూడా గెరాల్డ్ చెప్పడం విశేషం.

డీఎంకే సంగతేంటి :

అయితే విజయ్ పార్టీ టీవీకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదన్నట్లుగా గట్టి సంకేతాలు పంపించారు. అదే సమయంలో స్థానిక కాంగ్రెస్ నేతలతో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించుకోవాలని ఆయన అంటున్నారు. అంటే తమిళనాడులోని కాంగ్రెస్ నేతలు అయితే డీఎంకేతో ఉంటున్నారు. పొత్తు వారితోనే అని కూడా చెబుతున్నారు. అందుకే జాతీయ నాయకత్వం మీదనే భారం వేస్తూ బంతిని ఆ వైపుగా గెరాల్డ్ నెట్టారు అని అంటున్నారు. బీజేపీ అన్నా డీఎంకే పార్టీల మధ్య పొత్తు ఉంది. బీజేపీకి జాతీయ స్థాయిలో అధికార బలం ఉంది, అన్నా డీఎంకే కి లోకల్ గా పట్టుంది. క్యాడర్ బేస్ ఉంది. దాంతో పాటుగా సహజంగా అధికార పార్టీ వ్యతిరేకత వారికే మళ్ళుతుంది. విజయ్ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ అన్నా డీఎంకే కి లబ్ది కలుగుతుందని డీఎంకే వ్యతిరేక ఓట్ల కంటే బీజెపీ వ్యతిరేక ఓట్లనే టీవీకే చీలుస్తుంది అన్న విశ్లేషణ ఉంది. దాంతోనే కాంగ్రెస్ తో పొత్తుకు టీవీక ఆసక్తి చూపుతోంది అని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ ఆలోచన ఏమిటో. అటు స్టాలిన్ బలమైన మిత్రుడిగా ఉన్నారు, ఆయనను కాదని కాంగ్రెస్ విజయ్ పార్టీ టీవీకే వైపు వస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న.

Tags:    

Similar News