బీఆర్ఎస్ చాన్స్ మిస్...అప్పర్ హ్యాండ్ అటేనా ?
అయితే ఈ కీలక చర్చకు మాత్రం బీఆర్ఎస్ డుమ్మా కొట్టింది. మొత్తం సభను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది.;
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలానికి తెలంగాణా భవన్ కి వచ్చి పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. అదే విధంగా మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. ఈ రెండు సందర్భాలలో ఆయన చాలా ఆవేశంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ప్రధానంగా నీటి వివాదం పైనా బీఆర్ఎస్ ఫోకస్ పెడుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. నీరు అన్నది సెంటిమెంట్, నీరు నిధులు నియామకాలు అన్న మూడు అంశాల మీదనే తెలంగాణా ఉద్యమం అంతా సాగింది. అలాంటిది నీటి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది అన్నది గులాబీ పార్టీ చేస్తున్న ఘాటు ఆరోపణ. అలా కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టాలని చూసింది. ఆ విధంగా పకడ్బందీగా వ్యూహం కూడా రచించింది.
దీటుగా రియాక్షన్ :
అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈ సవాల్ కి నీటి సెంటిమెంట్ కి ధీటుగానే కాంగ్రెస్ రియాక్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ విషయం మీద కొడంగల్ మీటింగులోనే బీఆర్ఎస్ కి గట్టి కౌంటర్ ఇచ్చేశారు. అంతే కాదు అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తే మొత్తం అక్కడే జవాబు చెబుతామని కూడా ప్రతి సవాల్ చేశారు. ఇక ప్రజా భవన్ లో మీడియా సమావేశం పెట్టి మరీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ని నీటి వివాదాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అందులో బీఆర్ ఎస్ పదేళ్ళ పాలనలో తప్పులను ఎత్తి చూపించింది. ఇలా బీఆర్ఎస్ దూకుడుగా చేయాలనుకున్న రాజకీయానికి వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ బ్రేకులు వేయగలిగింది. అంతే కాదు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి నీటి వివాదాల మీద బీఆర్ఎస్ నిర్వాకం మీద తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఆ మీదట జల వివాదాలకు సంబంధించి అసలైన చర్చ శనివారం పెట్టారు.
బీఆర్ఎస్ డుమ్మా :
అయితే ఈ కీలక చర్చకు మాత్రం బీఆర్ఎస్ డుమ్మా కొట్టింది. మొత్తం సభను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. దానికి కారణం తమకు సభలో మాట్లాడే చాన్స్ ఇవ్వడం లేదని చెబుతోంది. అయితే ఎంత లేదనుకున్నా విపక్షంగా బీఆర్ఎస్ తన వాదన వినిపించుకోవడానికి అసెంబ్లీలో చాన్స్ ఉంటుంది. అది ఒక చట్ట సభ. తమ వాదన జనం ముందు వినిపించే ఒక అవకాశం. అలాంటి చోట బీఆర్ఎస్ సభా బహిష్కరణ పేరుతో దూరంగా ఉండడం అంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అని అంటున్నారు. ఎందుకంటే నీటి వివాదాల విషయంలో తరచూ బీఆర్ ఎస్ అధికార పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తోంది. తీరా సభలో ఆ అంశాల మీద చర్చ పెడితే బాధ్యత గలిగిన ప్రతిపక్షంగా హాజరు అవాల్సి ఉంది కదా అన్నది సగటు జనం నుంచి వచ్చే మాట. ఇదే ఒక రాజకీయ విశ్లేషణగా ఉది.
తేలిపోతోందా :
ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగిన జల వివాదాలు ఎవరి హయాంలో అన్యాయం జరిగింది అన్న దాని మీద చూస్తే కనుక అందరూ కలిసి చర్చించాల్సింది అసెంబ్లీ వేదికగా మాత్రమే. మరి అలాంటి వేదికను వద్దు అనుకుని బీఆర్ఎస్ తన వాదనా పటిమను జనం ముందు ఉంచడంలో తేలిపోయిందా అన్నదే చర్చగా ఉంది. తెలంగాణా భవన్ లో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వవచ్చు కానీ అది ఎంత వరకూ రీచ్ అవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. సభలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కానీ తమ వాదనను సమర్ధంగా వినిపించే దానిని కానీ బీఆర్ ఎస్ ఎందుకు వదులుకుంది అన్నదే చర్చ. రేపటి రోజున తెలంగాణాలో ఇదే అంశం మీద సభను పెడతామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే పాలమూరు ప్రాజెక్ట్ సోర్సుని జూరాల నుంచి శ్రీశైలం వద్దకు మార్చడం వెనక అవినీతి జరిగిందని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి ఒక సిట్ ని కూడా దీని మీద వేయాలనుకోవడం ద్వారా బీఆర్ ఎస్ నీటి రాజకీయానికి భారీ చెక్ పెడుతున్నారని అంటున్నారు. మొత్తానికి నీటి జగడం విషయంలో ఇప్పటికైతే కాంగ్రెస్ సేఫ్ జోన్ లోనే ఉందని చెబుతున్నారు. బీఆర్ఎస్ మరి ఏమి చెస్తుంది అన్నదే చూడాల్సి ఉంది.