మోడి-జగన్ కలుస్తారా ? కలవటానికి కారణాలు ఇవేనా ?

Update: 2020-10-09 05:15 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడి-జగన్మోహన్ రెడ్డి భేటి విషయంపైనే  గడచిన మూడు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.  జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరబోతున్నట్లు కొందరు, అలాంటిదేమీ లేదని మరికొందరు ఒకటే గోల పెట్టేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్డీఏలో చేరాలంటూ జగన్ను ప్రధాని ఆహ్వానించారని జాతీయ మీడియా కూడా కథనాలు ఇచ్చింది. కాబట్టి ఇదే నిజమని కాసేపు అనుకుందాం. అయితే అసలు ఎన్డీఏలో చేరమని మోడి ఎందుకు ఆఫర్ ఇవ్వాలి ? మోడి ఇచ్చినా జగన్ ఎందుకు చేరాలి ? అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఈ విషయాలపై కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని పాయింట్లు కనబడుతున్నాయి. అవేమిటంటే పరస్పర అవసరాలే ఇద్దరినీ దగ్గరకు చేరుస్తాయని. మళ్ళీ ఇందులో ఎవరి అవసరం వాళ్ళది, ఎవరి అవకాశం వాళ్ళది.

అవసరాలేంటి, అవకాశాలేమిటి అని పరిశీలిస్తే ముందుగా అవసరం మోడికే ఎక్కువుందన్న విషయం అర్ధమవుతోంది. వైసిపిని ఎన్డీఏలోకి ఆహ్వానించాల్సిన అవసరం మోడికి లేదని రాష్ట్ర  బీజేపీ నేతలు చెబుతున్నది తప్పు. ఇప్పటికిప్పుడు అవసరం లేకపోయినా భవిష్యత్తు పరిణామాలను గమనిస్తే కచ్చితంగా మోడికి వైసీపీ లాంటి పార్టీలతో అవసరం చాలానే ఉందని అర్ధమవుతుంది. ఎన్డీఏ-2 అధికారంలోకి వచ్చిన తర్వాత  కూటమిలో నుండి 18 ఎంపిల బలమున్న శివసేన వెళ్ళిపోతే తాజాగా అకాలీదళ్ వెళ్ళిపోయింది. ప్రస్తుత ఎన్డీఏలో బీజేపీ తర్వాత చెప్పుకోదగ్గ పార్టీనే లేదు. కూటమిలోని పార్టీలకున్న ఎంపిల బలాన్ని గమనిస్తే తలా నాలుగు, ఐదు ఎంపిలు కూడా ఉండదు. మరి ఇటువంటి పార్టీలను ఎన్నింటిని పెట్టుకుంటే మాత్రం మోడకి ఏమిటి ఉపయోగం.

పైగా ఈ పార్టీల్లో ఎప్పుడేవి ఎదురుతిరుగుతాయో కూడా తెలీదు. రాబోయే ఎన్నికల్లో కూటమిలోని చాలా పార్టీల తరపున ఎంపిలు గెలిచినా, ఓడినా ఒకటే. అవేమీ రాష్ట్రంలో కానీ కేంద్రంలోని చక్రంతిప్పే స్ధాయి పార్టీలు కావు. ఇదే సమయంలో అసెంబ్లీల్లో కూడా బీజేపీ పట్టు జారిపోయో అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘర్ లో బీజేపీ ఓడిపోవటమే ఇందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపి పవర్లోకి వచ్చినా ఎంతకాలం అధికారంలో ఉంటుందో తెలీదు.  

పైన చెప్పుకున్న కారణాలను పక్కన పెట్టేస్తే దక్షిణ భారతం మొత్తం మీద బీజేపికి గట్టి మద్దతుదారుగా నిలబడే పార్టీయే లేదు. కర్నాటక అధికారంలో ఉన్నా దినదినగండం నూరేళ్ళాయష్షు లాగే ఉంది పరిస్దితి. తమిళనాడు, కేరళ, ఏపి, తెలంగాణాలో ఎక్కడ చూసినా గట్టి పార్టనర్ లేడనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే వైసిపిని ఎన్డీఏలో చేర్చుకోవాల్సిన అవసరం మోడికి చాలా ఉందనే చెప్పాలి. ఎందుకంటే లోక్ సభ, రాజ్యసభలో కలిపి వైసీపీకి 28 మంది ఎంపిలున్నారు. లోక్ సభలో కన్నా మోడికి రాజ్యసభలో ఎంపిల అవసరం చాలా చాలా ఉంది. ఇప్పుడు రాజ్యసభలో వైసీపీకి 6 గురు ఎంపిలున్నా ముందు ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా జగన్ మద్దతు మోడికే చాలా అవసరం.

ఇక జగన్ కు ఎన్డీఏలో చేరటానికి ఉన్న అవసరాలేమిటో చూస్తే పూర్తిగా రాజకీయ కారణాలే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబునాయుడును రాజకీయంగా బిగించేయాలంటే జగన్ కు కేంద్రం మద్దతు చాలా అవసరం. రాజకీయంగా చూసుకుంటే జనసేన, బీజేపిలు ఆటలో అరటిపండు లాంటివనే చెప్పాలి. ఎందుకంటే అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పోటిలోకి దింపేంత సీన్ కూడా లేదు. గట్టి అభ్యర్ధులనే పోటికి దింపలేని పార్టీలు వైసీపీకి ఏ విధంగా సవాలు విసరగలవు ? కాబట్టి మోడి, జగన్ కచ్చితంగా కలుస్తారని చెప్పటానికి లేదు కానీ కలవటానికి అవకాశాలైతే ఎక్కువుగానే ఉన్నాయి. అయితే అది ఎప్పుడా అన్నదే సస్పెన్స్ ?
Tags:    

Similar News