ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే...మిధున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అంటూ వైసీపీకి లోక్ సభలో పార్టీ నాయకుడు పి మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.;
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అంటూ వైసీపీకి లోక్ సభలో పార్టీ నాయకుడు పి మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ఏపీలో గత రెండేళ్ళ రాజకీయాల గురించి వర్తమాన పరిస్థితుల గురించి మాట్లాడారు. ఏపీలో కూటమి పాలన తీరు మీద తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.
డౌన్ ఫాల్ స్టార్ట్ :
ఏపీలో టీడీపీ కూటమి పాలన మీద డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అని మిధున్ రెడ్డి చెప్పారు. గ్రౌండ్ లో ఎక్కడ చూసినా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ఒక ప్రభుత్వం కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇపుడే ఇలా ఉంటే మరో మూడేళ్ళలో కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని అన్నారు. అంతే కాదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏపీలో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మిధున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నిరుద్యోగంలో టాప్ :
ఏపీలో టీడీపీ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం దేశంలోనే టాప్ అన్నారు. జాతీయ స్థాయిలో సగటు 5.2 ఉంటే ఏపీలో అది 8.2 గా ఉందని అన్నారు. ఇది తాను చెప్పడం లేదని తాను పార్లమెంట్ లో వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అన్నారు. ఒక పక్క ఏపీలో లక్షలలో ఉద్యోగాలు అని చెబుతున్నారు కానీ భూములు 99 పైసలకు రియల్ ఎస్టేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. దీని వల్ల ఎవరికి ఉద్యోగాలు వస్తాయని ఆయన ప్రశ్నించారు. తాము తీసుకు వచ్చిన డేటా సెంటర్ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. తమ హయాంలో ఏపీలో శాశ్వత ఉద్యోగాలు లక్షన్నర సచివాలయాల్లో ఇచ్చామని ఇతరత్రా కూడా అనేక రంగాలలో ఇచ్చామని చెప్పారు. అలాగే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల వల్ల పెద్ద ఎత్తున ఉపాధి పెంచగలిగామని అన్నారు. దాని వల్లనే వైసీపీ హయాంలో 3.2 శాతం ఏపీలో నిరుద్యోగం రేటు ఉందని చెప్పారు.
ఎంపీగానే పోటీ :
తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తాను అని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని తనకు లేదని చెప్పారు. ఇక కేంద్ర మంత్రి కావాలని కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. తమ నాయకుడు జగన్ సీఎం అయితే చూసి సంతోషించేవారిలో తాను ఒకడిని అన్నారు. తాను జగన్ కి అభిమానిని అన్నారు. జగన్ రాజకీయాల్లో రాక ముందు నుంచే ఆయన పట్ల తనకు ఆరాధనాభావం ఉందని చెప్పారు. ఇక జగన్ తనకు మూడు సార్లు ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించారని అందుకే ఆయన పట్ల తాను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను అని మిధున్ రెడ్డి చెప్పుకొచ్చారు.
వైసీపీలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ :
వైసీపీలో జగన్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారని మిధున్ రెడ్డి చెప్పడం విశేషం. అందులో తాను ఒకడిని అన్నారు. జగన్ ఏది చెబితే అది చేయడానికి తాము అంతా సిద్ధం అని ఆయన అన్నారు. జగన్ ఒకరిని నమ్మితే విడిచిపెట్టరని, తాము కూడా ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి దూరమైన వారి ఆలోచనలు వేరేగా ఉండొచ్చు అని అన్నారు. ఏది ఏమైనా ఫిల్టర్ అయితేనే పార్టీ మరింతగా బలపడుతుందని అన్నారు.
ఎన్డీయేకి దగ్గర కావాలని :
ప్రజాస్వామిక విధానాలలో పనిచేసే పార్టీగా వైసీపీ ఉందని జగన్ అందరి అభిప్రాయాలను తెలుసుకుని అమలు చేసే నేత అని అన్నారు. ఆయన బ్ లమైన నాయకుడు కావడం వల్లనే బయట అలా ఆయన ఒక్కరే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తారు అని మిధున్ రెడ్డి వివరణ ఇచ్చారు. మావిగన్ ఆలోచన కూడా అందరితో చర్చించారని చాలా మంది రాతపూర్వకంగా కూడా దీని మీద తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అని మిధున్ రెడ్డి చెప్పారు. తాము ఎన్డీయేకి దగ్గర కావాలని ఎపుడూ అనుకోలేదని ప్రజలకు సంబంధించిన బిల్లులు అయితే సపోర్టు చేశామని చెప్పారు. తాము పొత్తులు ఎవరితో పెట్టుకోకుండా సొంతంగానే అధికారంలొకి రావాలన్న ఆలోచనతో ఉండడం వల్లనే కూటమి కట్టలేదని చెప్పారు.