ఒక్క లేఆఫ్ అతడి జీవితాన్ని తలకిందులు చేసింది..

ఐటీ రంగం అంటే ఒకప్పుడు విలాసానికి.. భద్రతకు మారుపేరు. ఏసీ గదులు.. లక్షల్లో జీతాలు.. వీకెండ్ పార్టీలు.. ఇవే సగటు టెక్కీ జీవితం అని అందరూ భావిస్తారు.;

Update: 2026-04-11 19:19 GMT

ఐటీ రంగం అంటే ఒకప్పుడు విలాసానికి.. భద్రతకు మారుపేరు. ఏసీ గదులు.. లక్షల్లో జీతాలు.. వీకెండ్ పార్టీలు.. ఇవే సగటు టెక్కీ జీవితం అని అందరూ భావిస్తారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న లేఆఫ్‌ల సుడిగుండం ఈ రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయటపెట్టింది. నిన్నటి వరకు సాఫ్ట్‌వేర్ కోడింగ్‌తో కుస్తీ పట్టిన ఒక ఇంజనీర్.. నేడు పొట్టకూటి కోసం బైక్ టాక్సీ నడుపుతున్న హృదయ విదారక ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కలల సౌధం.. ఒక్క నిర్ణయంతో కుప్పకూలింది!

నోయిడాకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ ఇది. సంవత్సరానికి రూ. 40 లక్షల భారీ ప్యాకేజీతో అతని జీవితం ఎంతో వైభవంగా సాగిపోయేది. ఆ ధీమాతోనే 2024లో తన చిరకాల స్వప్నమైన ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. రూ. 1.4 కోట్లు వెచ్చించి ఒక 3 బీహెచ్.కే ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నాడు. నెలకు రూ. 95,000 ఈఎంఐ కట్టాల్సి ఉన్నా.. తనకున్న జీతంతో అది పెద్ద భారం కాదని భావించాడు. కానీ విధి మరొకలా తలచింది.

ఒరాకిల్ లేఆఫ్స్.. మారిపోయిన తలరాత

ప్రస్తుతం గ్లోబల్ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఇండియాలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లేఆఫ్స్ ప్రక్రియలో భాగంగా మూడు నెలల క్రితం అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి కాకపోయినా ప్రతి నెల కట్టాల్సిన లక్ష రూపాయల ఈఎంఐ అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

కోడింగ్ నుంచి బైక్ టాక్సీ వరకు..

ఉద్యోగం పోయిన వెంటనే అతను ఖాళీగా కూర్చోలేదు. అనేక కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ప్రస్తుత మార్కెట్ మాంద్యం కారణంగా కొత్త ఉద్యోగం దొరకడం గగనమైంది. మరోవైపు బ్యాంకు నుంచి ఒత్తిడి పెరిగింది. తన రక్తం ధారపోసి కొనుక్కున్న ఇంటిని వదులుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి జీవనోపాధి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నాడు. "నిన్నటి వరకు ఏసీ గదుల్లో కూర్చుని ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు కోడింగ్ రాసిన ఆ చేతులు.. నేడు ఎండలో రాపిడో బైక్ నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కనీసం ఇంటి వాయిదాలు చెల్లించాలనే పట్టుదలతో అతను పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారి ఐటీ నిపుణులలో కలకలం రేపింది.

ఈ ఘటన నేర్పే గుణపాఠాలు

ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ కేవలం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదు.. నేటి తరం యువతకు ఒక హెచ్చరిక. ఈ ఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రధానాంశాలున్నాయి. అత్యవసర నిధి కింద ఉద్యోగం పోయినా కనీసం 6 నుండి 12 నెలల పాటు ఇంటి ఖర్చులు, ఈఎంఐలు చెల్లించేలా కొంత సొమ్మును ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. భారీ జీతం వస్తుందని చెప్పి, భారీ అప్పులు చేయడం ప్రమాదకరం. మన జీతంలో ఈఎంఐలు 30-40% మించకుండా చూసుకోవాలి. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం అప్‌డేట్ చేసుకోకపోతే లేఆఫ్స్ ముప్పు పొంచి ఉంటుంది. కేవలం ఒక్క ఉద్యోగం మీదే ఆధారపడకుండా చిన్నపాటి పెట్టుబడులు లేదా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించడం అవసరం.

లక్షల జీతం మనకు లగ్జరీని ఇవ్వగలదు కానీ ఆర్థిక క్రమశిక్షణ మాత్రమే మనకు భద్రతను ఇస్తుంది. ఈ రాపిడో రైడర్ కథ ఐటీ లోకానికి ఒక కనువిప్పు. ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదని.. అయితే ఆ ఉద్యోగం లేనప్పుడు మనల్ని నిలబెట్టేది మన ముందస్తు ఆర్థిక ప్రణాళికేనని ఈ ఘటన నిరూపించింది.

Tags:    

Similar News