'ప్రొద్దుటూరు' టీడీపీలో మార్పు త‌ప్ప‌దా.. !

పొద్దుటూరు. కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం. ప్రస్తుతం నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.;

Update: 2026-04-11 18:30 GMT

పొద్దుటూరు. కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం. ప్రస్తుతం నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న వరదరాజులు రెడ్డి స్థానికంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1980ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. తొలి తరం కాంగ్రెస్ నాయకుల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన అప్పట్లో యువ నాయకుడిగా గుర్తింపు సాధించారు.

ఆ తర్వాత 2009 -14 మధ్య ఓడిపోయారు. గత ఎన్నికల్లో మళ్ళీ టిడిపి తరఫున ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సీనియర్ నాయకుడు కావడం.. వయసు రీత్యా వ‌చ్చే వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న‌ ప్రజల్లో యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. ఫలితంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అన్నది వాస్తవం. ఇదే అంశాన్ని ఇటీవల చంద్రబాబు సహా మంత్రి నారా లోకేష్ కూడా ప్రస్తావించారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండే నాయకుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైకి చెప్పకపోయినప్పటికీ ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో యువ నాయకుడికి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మల్లెల లింగారెడ్డి టిడిపి తరఫున పోటీ చేశారు. ఇప్పుడు అవకాశం ఉంటే ఆయనకు కానీ లేకపోతే వేరే నాయకుడికి కానీ ఈ టికెట్టు ఇచ్చే దిశ‌గా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు స్తబ్దగా మారాయి.

ఎమ్మెల్యే ఇంటికే పరిమితం కావడం, వయసు రీత్యా ఆయన ప్రజల మధ్య యాక్టివ్ గా ఉండలేకపోవడం వంటి కారణాలతో టిడిపి తరఫున పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఇదే విషయంపై ఇటీవల చంద్రబాబు కూడా సీరియస్ గా స్పందించారు. ప్రజల మధ్య ఉండకపోతే కష్టమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి యువనేతకు అవకాశం ఇచ్చే ప‌రిస్థితి కనిపిస్తోంది. మరి దీనిని ఎవరు సద్వినియోగం చేసుకుంటారు అనేది చూడాలి. ఏదేమైనా కీలకమైన నియోజకవర్గంలో మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి.

Tags:    

Similar News