అప్పుల భారంతో అమెరికా వీడిన అమెరికా మాజీ అధ్యక్షుడి కొడుకు

అమెరికా రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ చుట్టూ అల్లుకున్న వివాదాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి.;

Update: 2026-04-11 19:20 GMT

అమెరికా రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ చుట్టూ అల్లుకున్న వివాదాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. సుమారు 17 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 158 కోట్లు) భారీ అప్పుల్లో కూరుకుపోయిన హంటర్.. ప్రస్తుతం అమెరికాను వీడి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వెలువడిన వార్తలు అగ్రరాజ్యంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

కోర్టులో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు

వాషింగ్టన్ డీసీలో హంటర్‌పై జరుగుతున్న ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది బ్యారీ కోబర్న్ సమర్పించిన పత్రాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. హంటర్ బైడెన్ ప్రస్తుతం అమెరికాలో లేరని.. ఆయన విదేశాల్లో నివసిస్తున్నారని న్యాయవాది స్పష్టం చేశారు. అయితే ఆయన ఏ దేశంలో ఉన్నారనే విషయంపై తనకే కచ్చితమైన సమాచారం లేదని కోబర్న్ చెప్పడం గమనార్హం. ఒక మాజీ అధ్యక్షుడి కుమారుడు.. అది కూడా అనేక న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న వ్యక్తి, దేశం విడిచి ఎక్కడ ఉన్నారో తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆర్థిక సంక్షోభం.. న్యాయ సంస్థల దావాలు

హంటర్ బైడెన్ కేవలం వ్యక్తిగత అప్పుల్లోనే కాదు.. తనకు అండగా నిలిచిన సంస్థలకు కూడా బకాయిలు పడ్డారు. ప్రఖ్యాత అంతర్జాతీయ న్యాయ సంస్థ విన్ స్టన్ స్ట్రావ్న్ హంటర్‌పై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. పన్ను ఎగవేత, అక్రమ ఆయుధాల కేసు వంటి క్లిష్ట సమయాల్లో హంటర్‌కు న్యాయ సేవలు అందించినందుకు గానూ ఆయన సుమారు 50,000 డాలర్లు (రూ. 43 లక్షలు) చెల్లించాల్సి ఉందని పదేపదే అడిగినా స్పందన లేదని ఆ సంస్థ ఆరోపించింది.

క్షమాభిక్ష.. పాత వివాదాలు

గతంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో 2024లో హంటర్ దోషిగా తేలారు. అయితే జో బైడెన్ తన అధ్యక్ష పదవి ముగిసే లోపు తన కుమారుడికి అధ్యక్ష క్షమాభిక్ష మంజూరు చేయడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే చట్టాన్ని పక్కన పెట్టారని విపక్షాలు మండిపడ్డాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా దేశం దాటడం ఆ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ఎక్కడ ఉన్నారనే దానిపై ఊహాగానాలు

హంటర్ బైడెన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. హంటర్ భార్య మెలిస్సా కోహెన్ దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన వ్యక్తి. దీంతో ఆయన అక్కడే తలదాచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2025 మే నెలలో ఆయన అక్కడ కనిపించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. భారీ అప్పుల్లో ఉండి, న్యాయవాదులకు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న హంటర్ ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన ఒక కుటుంబ వేడుక కోసం సుమారు 10,000 మైళ్ల ప్రయాణం చేయడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రయాణ ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ఆర్థిక అండగా నిలిచిన వారు

హంటర్ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఆయనకు హాలీవుడ్ ప్రముఖ న్యాయవాది కెవిన్ మోరిస్ పెద్ద ఎత్తున సహాయం చేశారు. ఇప్పటివరకు మోరిస్ సుమారు 6.5 మిలియన్ డాలర్లను హంటర్‌కు అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు హంటర్ వేసిన చిత్రపటాల అమ్మకం ద్వారా సుమారు 1.5 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినప్పటికీ న్యాయపరమైన ఖర్చుల ముందు ఆ మొత్తం సరిపోలేదని తెలుస్తోంది.

భారీ రుణాలు, అపరిష్కృత న్యాయ వివాదాలు, రహస్య విదేశీ నివాసం.. ఈ పరిణామాలు హంటర్ బైడెన్ జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ఇది కేవలం ఒక వ్యక్తిగత ఆర్థిక సమస్య మాత్రమే కాకుండా అమెరికా రాజకీయాల్లో మాజీ అధ్యక్షుడి కుటుంబ ప్రతిష్టపై పడిన మాయని మచ్చగా విశ్లేషకులు భావిస్తున్నారు. హంటర్ ఎప్పుడు తిరిగి వస్తారు? లేదా ఆయన విదేశీ నివాసం శాశ్వతమా? అన్నది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News