'సింగిల్ టైమ్‌' ఎమ్మెల్యేలు.. వీరి ప‌రిస్థితి ఇంతే.. !

గత ఎన్నికల్లో విజయం సాధించిన `ఫస్ట్ టైం` ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు కొంద‌రు కూడా వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కించుకునే అవకాశం లేదన్నది టిడిపిలో జరుగుతున్న ప్రధాన చర్చ.;

Update: 2026-04-11 22:30 GMT

గత ఎన్నికల్లో విజయం సాధించిన `ఫస్ట్ టైం` ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు కొంద‌రు కూడా వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కించుకునే అవకాశం లేదన్నది టిడిపిలో జరుగుతున్న ప్రధాన చర్చ. ఈ జాబితాలో దాదాపు పది నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. కారణాలు ఏవైనాప్పటికీ ఎమ్మెల్యేలుగా వారు వ్యవహరిస్తున్న తీరు ప్రధాన చర్చనయాంశంగా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ దక్కకపోవచ్చు అన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట.

ఈ జాబితాలో ప్రధానంగా తిరువూరు, శ్రీకాళహస్తి, పూతలపట్టు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చిత్తూరు జిల్లాలోని రెండు ఎస్సీ నియోజకవర్గాలు సహా చాలా నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోకపోవడం.. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండటంతో ఖచ్చితంగా వారికి వచ్చే ఎన్నికల్లో సీటు దక్కే అవకాశం లేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట.

ముఖ్యంగా పార్టీ లైనుకు భిన్నంగా వ్యవహరించిన నాయకులు.. పార్టీని తమకు అనుకూలంగా మలుచుకున్న నేతలు ఈ జాబితాలో ఉన్నారు. అదేవిధంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం పార్టీలోనే ఉన్నప్పటికీ వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరాదని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది. ఇలాంటి జాబితాలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇప్పటికే సీటు కోల్పోయారు. ఆయన పేరుకు మాత్రమే పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

కానీ, సత్యవేడు నియోజకవర్గంలో మాత్రం వేరే నాయకుడికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఆయనే అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. అలాగే తిరువూరులోనూ ఇదే తరహా పరిస్థితి రాబోయే రోజుల్లో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు వివాదంగా మారుతోంది. ఆయనకి ఇప్పటికే పదేపదే చెప్పి చూశారు. అయినా పద్ధతి మార్చుకోవడం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనకి కూడా ఈసారి టికెట్ రావడం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇక కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. సింగనమల ఎమ్మెల్యే కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. సో మొత్తానికి వీరంతా వచ్చే ఎన్నికల నాటికి తట్టా బట్టా సర్దుకొక తప్పదు అనేది పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

Tags:    

Similar News