కేశినేని కీలక నిర్ణయం తీసుకుంటారా ?

Update: 2023-05-31 12:34 GMT
రాజకీయాల్లో ఎప్పుడే డెవలప్మెంట్లు జరుగుతాయో ఎవరు చెప్పలేరు. ఒకనిముషం ఉన్నది మరో నిమిషంలో మారిపోతుంది. ఇపుడిదంతా ఎందుకంటే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీ వైసీపీ లోకి వస్తే ఆహ్వానిస్తామని అధికార పార్టీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి చెప్పారు. అయోధ్య ప్రకటనతో రెండు పార్టీల్లో ను కలకలం మొదలైంది. అసలు కేశినేని టీడీపీ కి రాజీనామా చేస్తారని ఎక్కడా చర్చలు జరగటం లేదు. టీడీపీకి రాజీనామా చేసినా వైసీపీ లో చేరుతారని కూడా అనుకోవడం లేదు.

చాలాకాలం క్రితం కేశినేని టీడీపీ కి రాజీనామా చేసి బీజేపీ లో చేరుతారనే ప్రచారం జరిగింది. దాన్ని ఎంపీ ఖండించారు. అప్పటి నుండి పార్టీ మారే విషయంలో ఎంపీ పై ఎలాంటి వార్తలు లేవు. అయితే చంద్రబాబునాయుడు తో ఎంపీ కి మంచి సంబంధాలు లేవన్నది వాస్తవం. ఎందుకంటే ఎంపీ ఏరోజు ఎలాగుంటారో ఎవరూ చెప్పలేరు. ఎంపీని బలంగా వ్యాతిరేకిస్తున్న బోండా ఉమ, బుద్ధా వెంకన్నా, దేవినేని ఉమ లాంటి నేతలను చంద్రబాబు కంట్రోల్ చేయటంలేదు.

ఇదే సమయంలో ఎంపీ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల ని పై నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అంటే పై రెండువర్గాల్లోని ఏ నేతలు ఎవరికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని అర్ధమవుతోంది. ఎందుకంటే విజయవాడ లో పై రెండువర్గాల నేతలు పార్టీకి అవసరమే. వీళ్ళమధ్య పంచాయితీలు చేయాలని చేసిన ప్రయత్నాలు విఫలమవ్వటంతో చంద్రబాబు కూడా వీళ్ళని అలా వదిలేశారు. అయితే రాజకీయ పరిణామాల్లో ముందుజాగ్రత్తగా కేశినేని తమ్ముడు కేశినేని శివధర్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు.

దాంతో ఎంపీ కి బాగా మండుతోంది. ఇందులో భాగంగానే నందిగామ వైసీపీ ఎంఎల్ఏ మొండితోక జగన్మోహన్ రావుతో ఎంపీ సన్నిహితంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కు పిలిస్తే హాజరయ్యారు. అప్పటినుండి ఎంపీకి వ్యతిరేకంగా పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీనికి అదనంగానే కేశినేని పార్టీలో కి  వస్తే ఆహ్వానిస్తామని అయోధ్య చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. నిప్పులేనిదే పొగరాదన్న విషయం అందరికీ తెలిసిందే. విజయవాడ పార్లమెంటులో వైసీపీ రెండు ఎన్నికల్లోను ఓడిపోయింది. కాబట్టే గట్టినేత కోసం వెతుకుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత కేశినేని తొందరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Similar News