మెగా ఫ్యామిలీ పొలిటిక‌ల్‌గా ఎందుకు ఫెయిల్ అయ్యారో.. ఈ స్టోరీ చూద్దాం!

Update: 2021-08-17 00:30 GMT
`మెగా` ఫ్యామిలీ. తెలుగు సినీ హిస్ట‌రీని తిర‌గ‌రాసిన కుటుంబం ఇది. మెగాస్టార్‌గా చిరంజీవి ప్ర‌స్థానం తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఒక సువ‌ర్ణాధ్యాయం. 150కి పైగా సినిమాల్లో హీరో పాత్ర‌ల‌తో ప్ర‌తి తెలుగింటి.. నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొ న్నారు. ఇప్ప‌టికీ.. ఆయన ఇమేజ్ చెక్కుచెద‌ర‌కుండా అలానే ఉంది. అదేస‌మ‌యంలో మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా క‌థానాయ‌కుడిగా.. అశేష తెలుగు ప్ర‌జల అభిమానం సంపాయించుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ కుటుంబం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ త‌ర‌హా ఇమేజ్‌ను రాజ‌కీయంగా సొంతం చేసుకోలేక పోవ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

వాస్త‌వానికి న‌టుల‌కు రాజ‌కీయాలు స‌రిప‌డ‌వా? అంటే.. తెలుగు నేల‌పై అలాంటి ప‌రిస్థితి ఏమీ లేదు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ముందుకు వ‌చ్చిన అన్న‌గారు.. ఎన్టీఆర్‌.. టీడీపీని స్థాపించిన ఆరు మాసాల‌కే.. అధికారం చేప‌ట్టి.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉవ్వెత్తున ఎగిశారు. ఇప్ప‌టికీ ఆ పార్టీ... ప్ర‌జ‌ల అభిమానం సొంతం చేసుకుంటూనే ఉంది. ఒడిదుడుకులు.. ఎదురైనా.. పార్టీ ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే చిరంజీవి కుటుంబం కూడా.. రాజ‌కీయ అరంగేట్రం చేసింది. 2009లో చిరంజీవి సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. ప్ర‌జారాజ్యం పేరుతో ఆయ‌న పార్టీని స్థాపించారు. సామాజిక న్యాయం నినాదంతో.. ఆయ‌న ముందుకు వ‌చ్చారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిపోతార‌నే అంచ‌నాలు కూడా వ‌చ్చాయి. అయితే.. అనూహ్యంగా.. ఆయ‌న పార్టీ ఉమ్మ‌డి రాష్ట్రంలో 18  స్థానాల‌కు ప‌రిమితం కాగా, చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి(పాల‌కొల్లు-తిరుప‌తి) ఒక‌చోట మాత్ర‌మే విజయం ద‌క్కించుకున్నారు. అందునా.. త‌న సొంత జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రిలోని పాల‌కొల్లులో ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆత‌ర్వాత‌.. పార్టీలో త‌లెత్తిన విభేదాలు.. అసంతృప్తుల‌ను చిరంజీవి స‌రిచేయ‌లేక‌పోయార‌నే వాద‌న ఉంది. ఆరోప‌ణ‌లు కూడా పార్టీని చుట్టుముట్టాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. కేంద్రంలో మంత్రి ప‌ద‌విని పొందారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు చిరంజీవి ద‌గ్గ‌రైంది ఎక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌దు. అంతేకాదు, పార్టీని నిల‌బెట్టుకునే ఆలోచ‌న కూడా చిరు చేయ‌లేక పోయారు.

ఇక‌, మెగా ఫ్యామిలీ నుంచి రాజ‌కీయంగా ముందుకు వ‌చ్చిన మ‌రోనేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్ర‌జారాజ్యం స‌మ‌యంలోనే ఆయ‌న యువ‌రాజ్యం విభాగానికి అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఈ క్ర‌మంలో 2014 ఎన్నిక‌ల‌కు ముందు సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. అయి తే.. ఆ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అదేస‌మ‌యంలో పార్టీని బ‌ల‌పోతం చేయ‌డంపైనా ఆయ‌న దృష్టి పెట్ట‌లేదు. ఇప్ప‌టికి పార్టీ పెట్టి దాదాపు ప‌దేళ్లు అవుతున్నా.. రాజ‌కీయంగా ఎక్క‌డా ఎదుగుద‌ల లేద‌నే వాద‌న జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో అంటే 2019లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. భీమ‌వ‌రం(ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా), విశాఖ జిల్లా.. భీమిలి నుంచి పోటీ చేసినా.. ఒక్క‌చోట కూడా విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌, పార్టీ ప‌రంగా కూడా కేవ‌లం ఒకే ఒక్క చోట 2019లో విజ‌యం సాధించారు.

తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. అయితే.. ఆయ‌న‌ను కూడా పార్టీలో నిల‌బెట్టుకోలేక పోయార‌నే వాద‌న ఉంది. ఇదిలావుంటే.. పార్టీని బ‌లోపేతం చేసుకుని.. ముందుకు సాగాల్సిన ప‌వ‌న్‌.. ఆదిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా.. కొన్ని రోజులు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. త‌ర్వాత 2019లో ఆ పార్టీతో విభేదించారు. అదేస‌మ‌యంలో బీజేపీతోనూ వైరం పెంచుకు న్నారు.కానీ, ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ బీజేపీతో చేతులు క‌లిపారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం చేశారు. ఇలా ఒక దిశ‌, ద‌శ లేకుండా ప‌వ‌న్ ప్ర‌యాణం చేస్తున్నాడ‌నే వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది.

ఇక‌, అస‌లు విష‌యానికి వ‌స్తే.. మెగా కుటుంబం రాజ‌కీయంగా ఎదగ‌క‌పోవ‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలా అంటే.. మెగా ఫ్యామిలీ అన‌గానే సినీ ప్ర‌పంచ‌మే ఇప్ప‌టికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుర్తుకు వ‌స్తుంది త‌ప్ప‌.. రాజ‌కీయం అనే మాట వినిపించ‌డం లేదు. వాస్త‌వానికి రాజ‌కీయం అంటే.. బూత్ లెవెల్‌లో కార్య‌క‌ర్త‌లు ఉండాలి. వారిని డెవ‌ల‌ప్ చేసుకోవాలి. వారిలో ధైర్యం పెంచాలి. కానీ, మెగా ఫ్యామిలీ ఏరోజూ అలా చేయ‌లేదు. ముఖ్యంగా పార్టీకి క్రియా శీల కార్య‌క‌ర్త‌లు అవ‌స‌రం. కానీ, ఆదిశ‌గా ప‌వ‌న్ ప్ర‌య‌త్నించ‌డం లేదు. నేను రంగంలోకి దిగితే.. ల‌క్ష‌ల మంది వ‌స్తారు.. అనే మాటే త‌ప్ప‌.. వాస్త‌వంలో ఎక్క‌డా ఆయ‌న క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితిపై ఆలోచ‌న చేసింది లేదు.

పైగా త‌న స‌భ‌ల‌కు వ‌చ్చేవారంతా.. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లేన‌ని ప‌వ‌న్ భావిస్తూ వ‌చ్చారు. అయితే.. వాస్త‌వానికి ఇలా వ‌చ్చిన వారిలో ఎంత‌మంది ఓట్లు వేస్తున్నారు? ఎంత మంది ప‌వ‌న్‌కు జై కొడుతున్నారు అనే విష‌యాల‌పై ఎంత మంది చెప్పినా.. ప‌వ‌న్ వినిపించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. అదేస‌మ‌యంలో ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా స్థిర‌త్వం లేక‌పోవ‌డం.. మ‌రో ప్ర‌ధాన అవ‌రోధంగా మారిపోయింది. ఎప్పుడు.. ఎవ‌రికి జై కొడ‌తారో.. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెంటుకుంటారో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే మెగా ఫ్యామిలీకి రాజ‌కీయాలు క‌లిసి రావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  మ‌రి ఇప్ప‌టికైనా త‌ప్పులు స‌రిచేసుకుని.. వాస్త‌వంలో రాజ‌కీయంగా ముందుకు సాగితేనే ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు రాజ‌కీయ మేధావులు.
Tags:    

Similar News