ఇద్దరు జీవిత ఖైదీల మధ్య చిగురించిన ప్రేమ.. హైకోర్టు జోక్యంతో ట్విస్టు

హనుమాన్ ప్రసాద్ 2017లో జైలుకు రాగా, ప్రియా సేఠ్ 2018లో వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు అల్వార్ ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆరు నెలల క్రితం జైలులో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.;

Update: 2026-01-24 10:16 GMT

ఆ ఇద్దరు జీవిత ఖైదీలు. ఒకరేమో ఐదుగురిని చంపి జైలు శిక్ష అనుభవిస్తుంటే, మరొకరు ఒకరిని చంపి జైలులో చిప్పకూడు తింటున్నారు. ఇద్దరూ ప్రేమ పేరుతోనే హత్యాకాండకు తెగబడ్డారు. కోర్టులో నేరం నిరూపించడంతో శిక్షలు పడ్డాయి. అలా శిక్ష అనుభవిస్తున్న ఆ ఇద్దరు మరోసారి ప్రేమలో పడ్డారు. జైలులో శిక్ష అనుభవిస్తూ ప్రేమించుకోవడం ఒక ఎత్తైతే.. పెళ్లి చేసుకుంటాం, అనుమతి ఇవ్వండి అంటూ అధికారులను కోరడం, ఈ విషయం హైకోర్టు దృష్టికి వెళ్లడం, ఆ ఇద్దరి ప్రేమను పెళ్లి పీటలు ఎక్కేలా కోర్టు అనుమతించడం మరో విశేషం. ఈ మొత్తం ఎపిసోడ్ ప్రేమ కథల్లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని అంటున్నారు.

రాజస్థాన్ లోని అల్వార్ లో ఓపెన్ ఎయిర్ జైలులో ప్రియ సేఠ్ (34) హనుమాన్ ప్రసాద్ (29) శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఇద్దరు హత్య కేసుల్లో నేరం నిరూపితమవడంతో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ప్రియా సేఠ్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన దుష్యంత్ శర్మ (27)ను హతమార్చి జైలుకు వచ్చింది. అదేవిధంగా హనుమాన్ ప్రసాద్ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె భర్త, ముగ్గురు పిల్లలు, మేనల్లుడిని మత్తు మందు ఇచ్చి చంపేశాడు. ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో కోర్టు జీవిత ఖైదు విధించింది.

హనుమాన్ ప్రసాద్ 2017లో జైలుకు రాగా, ప్రియా సేఠ్ 2018లో వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు అల్వార్ ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆరు నెలల క్రితం జైలులో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవడానికి పెరోల్ కావాలని హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై ఈరోజు(శుక్రవారం) విచారణ జరిపిన కోర్టు.. వీరి పెళ్లి కోసం 15 రోజుల పెరోల్ ఇచ్చింది. ప్రియ, హనుమాన్ ప్రసాద్‌లు పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి చేసుకోనున్నారు. 15 రోజుల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

2018లో ప్రియా సేథ్ తన ప్రియుడు దీక్షిత్ కమ్రా అప్పులు తీర్చేందుకు ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. డేటింగ్ యాప్ ద్వారా దుష్యంత్ శర్మ అనే యువకుడిని పరిచయం చేసుకుంది. తర్వాత అతడిని రూముకు పిలిచి కిడ్నాప్ చేసింది. ప్రియకు ఆమె ప్రియుడు దీక్షిత్, మరో యువకుడు లక్ష్య వాలియా కూడా సహకారం అందించారు. ముగ్గురూ కలిసి అతడ్ని రూ.10 లక్షలు అడిగారు. అయితే దుష్యంత్ కేవలం రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వగలిగాడు. అతడ్ని బయటకు పంపిస్తే.. కిడ్నాప్ విషయం బయటపడుతుందన్న భయంతో ముగ్గురూ కలిసి అతణ్ని హతమార్చారు. ఈ కేసులో సూత్రధారి అయిన ప్రియకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఇక అల్వార్‌కు చెందిన హనుమాన్ ప్రసాద్ స్టోరీ ఇంచుమించు ఇదే విధంగా ఉంది. 2017లొ ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా హనుమాన్ ప్రసాద్ ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో హత్యలకు ఒడిగట్టాడు. ప్రియురాలి భర్తను, పిల్లలను అతి దారుణంగా హత్య చేశాడు. మొత్తం ఐదుగురిని అతి కిరాతకంగా మటన్ కొట్టే కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. దీంతో హనుమాన్ ప్రసాద్‌కు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. ఇలా ఇద్దరూ ప్రస్తుతం అల్వార్ ఓపెన్ ఎయిర్ జైలులో ఉండగా, వారి మధ్య పరిచయం పెరగడం, అది ప్రేమగా మారి వివాహ బంధంతో ఒక్కటయ్యే వరకు చేరింది. ఈ ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News