ట్రంప్ చేతిపై గాయం.. అధ్యక్షుడి ఆరోగ్యంపై మళ్లీ చర్చ
ఇదే మొదటిసారి కాదు.. గతంలో కూడా ట్రంప్ చేతిపై గాయాల ఫొటోలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన ఎడమ చేతిపై గాయం కనిపించడంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.., అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దావోస్ వేదికగా గాజా శాంతి మండలి కార్యక్రమాన్ని ట్రంప్ ప్రారంభించిన సమయంలో, ఆయన ఎడమ చేతిపై ఉన్న గాయం స్పష్టంగా కనిపించింది. దీంతో నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు వెంటనే ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలోనూ ట్రంప్ ఆరోగ్యంపై తరచూ చర్చలు జరిగిన నేపథ్యంలో, ఈ గాయం మరోసారి అనుమానాలకు తావిచ్చింది.
గాయంపై స్పందించిన కరోలిన్ లీవిట్..
ఈ అంశంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. శాంతి మండలి కార్యక్రమంలో బల్ల మూలకు చేతి తగలడంతో గాయమైందని ఆమె స్పష్టం చేసింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఇది సాధారణ గాయమేనని వెల్లడించారు. ట్రంప్ కూడా స్వయంగా స్పందిస్తూ, తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. గాయం కారణంగా వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లు సూచించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఆస్ప్రిన్ తీసుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే, ఇది కూడా కేవలం జాగ్రత్త చర్యగానే చెప్పుకొచ్చారు. అధ్యక్షుడి వ్యాఖ్యలతో ఆయన ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలు కొంత వరకు తగ్గినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చర్చ ఆగడం లేదు.
గతంలో కనిపించిన గాయాలు..
ఇదే మొదటిసారి కాదు.. గతంలో కూడా ట్రంప్ చేతిపై గాయాల ఫొటోలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే, వైట్‌హౌస్ ఆ వార్తలను వెంటనే ఖండించింది. రక్తనాళాలకు సంబంధించిన స్వల్ప సమస్య ఉందని, అది వృద్ధుల్లో సాధారణంగా కనిపించేదేనని అప్పట్లో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వైట్‌హౌస్ కూడా అదే తరహా వివరణ ఇస్తోంది. అధ్యక్షుడి ఆరోగ్యం పూర్తిగా బాగుందని, విధుల్లో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ట్రంప్ వయస్సు, గత వైద్య నివేదికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఆరోగ్యంపై ప్రతిసారీ ఇలాంటి చర్చలు చెలరేగడం సహజమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, దావోస్ వేదికపై కనిపించిన చిన్న గాయం అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి రాజకీయ, సామాజిక చర్చలకు దారితీసింది. అధికారిక వర్గాలు మాత్రం దీనిని సాధారణ ఘటనగానే కొట్టిపారేస్తున్నాయి.