దావోస్ టు ఏపీ.. లోకేశ్ ఏం తెస్తున్నారంటే..?

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సు ముగిసింది.;

Update: 2026-01-24 09:33 GMT

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సు ముగిసింది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహించారు. "స్పిరిట్ ఆఫ్ డైలాగ్" అనే థీమ్‌తో నిర్వహించిన ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి వేల మంది అతిథులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా 400 మంది రాజకీయ నాయకులు, 850 మంది సీఈఓలు పాల్గొన్నారు.

మన దేశం నుంచి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం దావోస్ వెళ్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు ముందుగానే స్వదేశానికి తిరిగి రాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ నుంచి అమెరికా టూర్ కు వెళ్లారు. ఇక యువనేత నారా లోకేశ్ తన నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని శనివారం సాయంత్రం దేశానికి వస్తున్నారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో పెట్టుబడుల ఆకర్షణకు వినూత్న విధానాన్ని అవలంబిస్తున్న ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత ఏడాది దావోస్ సదస్సు వెళ్లిన లోకేశ్ రాష్ట్రానికి రూ.2.5 లక్షల పెట్టుబడులను తీసుకువచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్, యాక్సెంచర్ వంటి సంస్థలతో చర్చలు జరిపి వాటి కార్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా ఒప్పించారు. ఆ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదేసమయంలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని 11 నెలల్లోనే విశాఖలో ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో లోకేశ్ ఈ ఏడాది ఎలాంటి రిజల్ట్ తీసుకువస్తున్నారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.

దావోస్ లో నాలుగు రోజులు గడిపిన మంత్రి లోకేశ్ దాదాపు 45 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. 25 వన్-టు-వన్ సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. 8 రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నారు. అదేవిధంగా ఐదు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన గూగుల్ క్లైడ్, ఐబీఎం, బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్. వీస్టాస్, జీరా, ఆర్ఫీఎస్జీ గ్రూప్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలతో చర్చలు జరిపారు. "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" నినాదంతో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు.

ఈ పర్యటన ద్వారా మంత్రి లోకేశ్ 90 వేల కోట్ల పెట్టుబడిని సాధించారు. దీనిద్వారా రాష్ట్రంలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయని చెబుతున్నారు. దావోస్ సదస్సులో RMZ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అత్యంత ప్రధానమైనదిగా అభిర్ణిస్తున్నారు. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ రంగాల్లో దాదాపు 1 లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విశాఖపట్నంలో 10 మిలియన్ చదరపు అడుగుల ఐటీ పార్క్ (GCC), రాయలసీమలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే వెస్టాస్ కంపెనీ విండ్ టర్బైన్ తయారీ యూనిట్ ఏర్పాటుపై, జీరా సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులపై ఆసక్తి కనబరిచాయి.

Tags:    

Similar News