రాజ్యసభ రూట్ లో విజయసాయిరెడ్డి ?
వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ రూట్ లో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది.;
వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ రూట్ లో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఆయన 2025 జనవరి 25న తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తరువాత ఆయన వైసీపీకి కూడా రాజీనామా చేసారు. ఈ విధంగా సంచలన నిర్ణయం తీసుకుని మూడున్నరేళ్ళ తన పదవీ కాలాన్ని ఆయన వదిలేసుకున్నారు. ఇక విజయసాయిరెడ్డి విడిచిపెట్టిన ఎంపీ సీటు బీజేపీ పరం అయింది. లేటెస్ట్ గా చూస్తే విజయసాయిరెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను రాజకీయాలలో కొనసాగుతాను అన్నారు.
రాజ్యసభ ఎన్నికల వేళ :
దేశవ్యాప్తంగా 72 దాకా రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అవన్నీ ఈ ఏడాది జూన్ లోగానే భర్తీ చేస్తారు. ఈ మొత్తం ఖాళీలలో అత్యధిక సీట్లు తిరిగి రాబట్టుకునేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే అని అంటున్నారు. ఈ మధ్యనే బీహార్ లో బీజేపీ దాని మిత్ర పక్షం జేడీయూ గెలిచాయి. యూపీలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. అలాగే అనేక ఇతర రాష్ట్రాలలో రాజ్యసభ ఖాళీలు అవుతున్నాయి. వీటిని ఎక్కువగా బీజేపీ గెలుచుకుంటుంది. దాంతో విజయసాయిరెడ్డి చూపు బీజేపీ మీద ఉంది అని అంటున్నారు.
సాఫ్ట్ కార్నర్ తోనే :
ఇక విజయసాయిరెడ్డి ఈ రోజుదాకా బీజేపీని ఎక్కడా విమర్శించినది లేదు, పైగా మోడీ పాలనకు ఆయన కితాబు ఇస్తున్నారు. అంతే కాదు ఆయన రాజ్యసభ సీటుకు రాజీనామా చేస్తున్నప్పుడు కూడా బీజేపీ కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఇవన్నీ చూసిన వారు ఆయనకు బీజేపీతో మంచి రిలేషన్స్ ఉన్నాయని భావించారు. ఆయన వెంటనే బీజేపీలో చేరుతారు అని అనుకున్నా ఏడాది పాటు విరామం తీసుకోవడం అంటే వ్యూహాత్మకంగానే అని అంటున్నారు. ఇపుడు తగిన సమయం వచ్చింది అని అందుకే తాను రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి తాజాగా ప్రకటించారు అని అంటున్నారు.
బీజేపీ ఓకే అంటుందా :
విజయసాయిరెడ్డి రాజకీయంగా మంచి అనుభవం కలిగిన వారు, వ్యూహకర్తగా పేరు గడించారు. వైసీపీకి బ్యాక్ బోన్ గా ఉన్నారు. ఆయనను కనుక చేర్చుకుంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో పార్టీ బలాన్ని విస్తరించుకోవచ్చు అన్న ఆలోచనలు కమలదళానికి ఉన్నాయని చెబుతున్నారు. అంతే కాదు ఆయనకు ఎంతో మంది వైసీపీ నేతలతో పరిచయాలు బాగా ఉన్నందువల్ల ఆ పార్టీ నుంచి కూడా బీజేపీలోకి వలసలు వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా సబ్జెక్ట్ మీద బాగానే మాట్లాడుతారు అని పేరు ఉంది. దాంతో ఆయన సేవలను పెద్దల సభలో కూడా సమర్ధంగా వినియోగించుకోవచ్చు అన్నది కూడా కమలనాధులలో ఉంది అని అంటున్నారు.
అన్నీ కుదిరితే :
ఇక విజయసాయిరెడ్డికి కాషాయం పార్టీ మంచి ఆప్షన్ గా ఉంది. ఆయన వైసీపీని విమర్శించి అందులో తిరిగి చేరలేరు, అంతే కాదు, టీడీపీలో చేరేది ఉండదు, దాంతో ఆయనకు ఏకైక ఆప్షన్ గా బీజేపీ ఉంది అని చెబుతున్నారు. దాంతో పాటు ఆయనకు కేంద్ర బీజేపీ పెద్దల వద్ద ఉన్న మంచి పరిచయాలు కూడా బీజేపీలో చేరేందుకు ఉపకరిస్తాయని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే ఎంపీ సీటు ఆయనకు లభిస్తుందా అంటే ప్రచారంలో అదే ఉంది. ఈ రెండు జరిగితే కనుక ఏపీ రాజకీయాల్లో సమూలమైన మార్పులు వస్తాయని అంటున్నారు. అటు అధికార కూటమి ఇటు వైసీపీకి కూడా విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ అన్నది ఒక కుదుపుగా ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఈ తరహా ప్రచారంలో నిజమెంత ఉందో. ఏమి జరుగుతుందో.