పీఆర్సీ నివేదిక ఎందుకివ్వటం లేదు ?

Update: 2021-12-04 06:12 GMT
ఉద్యోగులతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోరి గోక్కుంటున్నట్లే ఉంది. లేకపోతే పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వటానికి ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో అర్థం కావటంలేదు.

పీఆర్సీ నివేదిక అంటేనే ఉద్యోగులకు సంబంధించిందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఉద్యోగుల కోసం సిద్ధమైన నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోంది ?

పీఆర్సీ నివేదిక అమలుపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో పీఆర్సీ నివేదికను నేతలకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

కార్యదర్శుల కమిటితో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయినపుడు నివేదికను తమకు ఇవ్వమని అడిగారు. అయితే తిరుపతి పర్యటనలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జగన్ మాట్లాడుతూ పదిరోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తానని చెప్పారు. ఇంతవరకు ఓకేనే కానీ అసలు నివేదిక విషయంలోనే సమస్యంతా పెరిగిపోతోంది.

ఇక్కడ ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏమిటంటే పీఆర్సీ నివేదిక వేరు పీఆర్సీ నివేదికను అమలు చేయడం వేరు. మామూలుగా ఏ ప్రభుత్వమైనా పీఆర్సీని అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల నేతలకు పీఆర్సీ నివేదిక కాపీని ఇవ్వడం మామూలే.

ఆ నివేదికను నేతలు అధ్యయనం చేసిన తర్వాత ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వంతో బేరాలు మొదలుపెడతారు. రెండువైపులా బేరసారాలు జరిగిన తర్వాత ఎక్కడో ఓ చోట ఫిట్మెంట్ పై అంగీకారం కుదురుతుంది.

ఈ విషయాలన్నీ జగన్ కు తెలీక పోయినా ఉన్నతాధి కారులకు తెలీకుండా ఉండదు. ఎందుకంటే పీఆర్సీ నివేదిక పై ముందుగా అధ్యయనం చేసేది ఐఏఎస్ అధికారులే కాబట్టి.

పీఆర్సీ నివేదిక పై చీఫ్ సెక్రటరీ, సీఎంవో, ఫైనాన్స్ ఉన్నతాధికారులు అధ్యయనం చేసిన తర్వాతే విషయం ముఖ్య మంత్రి దాకా వెళుతుంది. మరింత మంది నివేదికను అధ్యయనం చేసిన తర్వాత నివేదిక కాపీని ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వటంలో అభ్యంతరాలు ఏముంటాయి ?

కార్యదర్శుల కమిటీ సమావేశంలో కూడా పీఆర్సీ నివేదికను ఇవ్వటం కుదరదని చెప్పటమే విచిత్రంగా ఉంది. పీఆర్సీని 10 రోజుల్లో ప్రకటిస్తామని సీఎం చెప్పిన తర్వాత ఇక నివేదికతో పనేముందన్నట్లుగా కమిటిలోని ఐఏఎస్ అధికారులు నేతలను ప్రశ్నించటం నిజంగా విడ్డూరమే.

అందుకనే పీఆర్సీ నివేదికలో ఏమన్నా తప్పులున్నాయా అనే నేతల సందేహాలకు మద్దతు పెరుగుతోంది. కారణమేదైనా నివేదిక కోసం నేతలు కూడా పట్టుబడుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News