వచ్చే ఎన్నికల్లో మోదీ ఫ్రెండ్స్ ఎవరెవరు?

Update: 2018-07-22 16:43 GMT
చంద్రబాబు పెట్టిన అవిశ్వాస పరీక్ష ప్రధాని మోదీ నెత్తిన పాలు పోసింది. ఈ అవిశ్వాసాన్ని బీజేపీ చాలా సూక్ష్మ స్థాయిలో విశ్లేషించుకుని వచ్చే ఎన్నికలకు వ్యూహాలు రచించుకుంటోంది. దేశంలోని పార్టీల్లో తమ వారెవరు.. పరాయివారెవరన్నది అర్థం చేసుకోవడానికి బీజేపీకి ఇది బాగా ఉపయోగపడింది. అంతేకాదు.. ఎన్డీయే కూటమి ఏమాత్రం వీకవలేదు అని దేశానికి చాటడానికి కూడా ఇది ఉపయోగపడింది.
   
కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏ పార్టీ మద్దతూ సంపాదించుకోలేకపోవడం మోదీకి కలిసొచ్చే అంశమైతే. గతం మరిచి అన్నాడీఎంకే తమకు మద్దతు పలకడం అనుకూలించే అంశం. ఇక బీజేపీపై గరంగరంలాడుతున్న శివసేన ఏం చేస్తుందో అని అంతా ఆసక్తిగా చూశారు. ఆ పార్టీ ఓటింగులో పాల్గొనకుండా తప్పించుకుందే కానీ విపక్షం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గైర్హాజరు కావడం కూడా మోదీకే అనుకూలించిందన్న సంగతి వేరేగా చెప్పనవసరం లేదు. ఇక బీజేడీ అయితే.. సభలో చర్చలో కూడా లేదు. టీఆరెస్ చర్చ వరకు ఉండి ఓటింగు సరికి తుర్రుమని మోదీకి హెల్ప్ చేసింది. అంతేకానీ.. కాంగ్రెస్ పంచన చేరలేదు.
   
దీంతో మోదీకి వచ్చే ఎన్నికలపై ఫుల్ క్లారిటీ వచ్చిందని అర్థమవుతోంది. పార్టీల మద్దతు గత ఎన్నికల్లో ఉన్నట్లే ఉంటుంది.. చేయాల్సిందంతా ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడమేనన్నది మోదీ తాజా ప్లానుగా తెలుస్తోంది.
   
దీంతో చంద్రబాబు అవిశ్వాసం పెట్టి చాలామంచి పనిచేశారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఎన్డీయే కూటమి ఏకతాటిపై ఉందని చాటడమే కాకుండా ప్రతిపక్షాలు ఎవరి మద్దతూ సాధించలేకపోయాయని దీంతో తేలిపోయందని అంటున్నారు.
Tags:    

Similar News