జగన్ పాదయాత్ర కన్ఫాం... సంచలన వివరాలు చెప్పిన మాజీ సీఎం!
అవును... ఏలూరు నియోజకవర్గ కేడర్ తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు.;
త్వరలో వైఎస్ జగన్ బస్సు యాత్ర ఉంటుందని.. జిల్లాల యాత్ర ఉంటుందని రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తన పాదయాత్రకు సంబంధించిన సంచలన ప్రకటనను వైసీపీ అధినేత వెల్లడించారు. ఇందులో భాగంగా... ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర ఉంటుందని.. ఇది ఏలూరు నుంచే మొదలవుతుందని తెలిపారు! ఈ నేపథ్యంలో... ప్రజలందరూ వైసీపీ వైపే చూస్తున్నారని.. ఈ సమయంలో కేడర్ అంతా తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని జగన్ పిలుపునిచ్చారు.
అవును... ఏలూరు నియోజకవర్గ కేడర్ తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కారుమూరి సునీల్, జయ ప్రకాశ్ తో పాటు పలువురు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలోనే 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పాదయాత్ర గురించి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన జగన్... కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైసీపీ ఉంటుందని.. విద్యార్థులు, రైతులు, యువత, అక్కచెల్లెమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నామని... ఇదే స్ఫూర్తి ఇక ముందు కొనసాగించాలని.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ప్రతీ ఇంట్లోనూ ఇదే చర్చ జరుగుతుందని జగన్ అన్నారు.
ఈ నేపథ్యంలోనే... కూటమి ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమేనని చెప్పిన జగన్.. తాను మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని.. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని తెలిపారు. అంతకుముందు ప్రతీవారం ఒక్కో నియోజకవర్గం నాయకులతో భేటీ అవుతానని జగన్ పేర్కొన్నారు. దీంతో.. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది!
ఈ సందర్భంగా... క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం, క్యాడర్ తో మమేకం కావడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని జగన్ స్పష్టం చేశారు! ఇదే సమయంలో.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని అన్నారు. ఏది ఏమైనా.. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంతటి భారీ కార్యాచరణను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా... 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. "ప్రజా సంకల్ప యాత్ర" పేరుతో జగన్ సుమారు 3,648 కిలోమీటర్ల మేర దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో 2029 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ముందు తాను మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది.