తెలంగాణలో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్... ఏయే కేసుల్లో అంటే..!

కొన్ని ప్రత్యేక నేరాలు జరిగిన విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2026-01-21 11:30 GMT

కొన్ని ప్రత్యేక నేరాలు జరిగిన విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండా.. సమాచారం అందింస్తే, పోలీసులే వారి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేసుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. దీని అమలుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్.ఓ.పీ)ని సీఐడీ రూపొందించింది.

అవును... కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. వారి ఇంటికే వెళ్లి కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది. ప్రధానంగా తీవ్రమైన నేరం బారిన పడినప్పుడు బాధితులు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశమున్న దృష్ట్యా ఈ సౌలభ్యం కల్పించబోతోన్నట్లు తెలిపింది! ఈ మేరకు రూపొందించిన ఎస్.ఓ.పీ.ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లు అనుసరించాలని సీఐడీ చీఫ్‌ చారుసిన్హా స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో.. బాధితుల గౌరవానికి, హక్కులకు భంగం కలిగించకుండా పోలీస్‌ సేవలందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఐడీ ప్రకటించింది. ఇలా.. బాధితులు పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయాలని నిర్ణయించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. దీనిపై తెలంగాణ పోలీసులకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది చాలా మంచి నిర్ణయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు!

ఈ కొత్త నిర్ణయం ప్రకారం... కొన్ని ప్రత్యేక నేరాలు జరిగిన సమయంలో బాధితులు పోలీస్ స్టేషన్ కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి! ఆ ఫోన్ కాల్ అందుకున్న అనంతరం పోలీసులే వారి వద్దకు వెళ్లి, ఫిర్యాదు స్వీకరిస్తారు. అనంతరం.. ఆ వివరాలను పోలీస్‌ స్టేషన్‌ కు పంపించి ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయించి.. దానికి సంబంధించిన ఓ కాపీని బాధితులకు అందజేస్తారు. అక్కడికక్కడే బాధితుల వాంగ్మూలం నమోదు చేస్తారు!

ఈ సందర్భంగా సుమారు 7 రకాల ప్రత్యేక కేసుల్లో ఈ ఎస్.ఓ.పీ.ని అమలు చేయనున్నారు..!

* పోక్సో చట్టం కేసులు

* మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు

* ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు

* శారీరక దాడులు

* బాల్య వివాహాల నిషేధ చట్టం

* ర్యాగింగ్‌ నిరోధక చట్టం

* ఆస్తి సంబంధ వివాదాల్లో బాధితులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు.. ఈ ఎస్.ఓ.పీ. అమలు చేయబడుతుంది.

Tags:    

Similar News