జేడీ ఏ పార్టీలో చేరుతారు ?

Update: 2023-03-27 17:00 GMT
సీబీఐ రిటైర్ట్ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారు ? కొంతమందికి ఇపుడీ ప్రశ్న చాలా ఆశక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని చెబుతున్నారు. పోటీ ఖాయం అయితే ఏ పార్టీ నుండే అన్నది సస్పెన్సు గా ఉంది. ఇదే విషయమై లక్ష్మీనారాయణ మాట్లాడుతు  వైసీపీ, బీఆర్ఎస్ లో చేరమని తనకు ఆఫర్ లు వచ్చాయన్నారు. రెండు పార్టీల నేతలు తనను ఎక్కడ కలిసినా తమ పార్టీలో చేరమని పదేపదే అడుగుతున్నారట.

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి కచ్చితంగా తొందరలోనే జేడీ ఏదో ఒక నిర్ణయమైతే తీసుకోక తప్పదు. జేడీ లాంటి ఉన్నత విద్యావంతులు, విషయ పరిజ్ఞానం ఉన్న రిటైర్డ్ అధికారులు చట్టసభల్లోకి అడుగు పెడితే బాగానే ఉంటుంది. కాకపోతే ఏ పార్టీ తరపున పోటీచేస్తే చట్టసభలో కి అడుగుపెట్టే అవకాశం ఉందనే విషయాన్ని జేడీయే తేల్చుకోవాలి. పోయిన ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం లోక్  సభకు పోటీచేశారు. నలుగురు గట్టి అభ్యర్ధులు చేసిన పోటీలో అప్పట్లో జేడీకి సుమారు లక్ష ఓట్లొచ్చాయి.

అంటే వాటిల్లో  వ్యక్తిగతంగా లక్ష్మీనారాయణ ను అభిమానించే వాళ్ళు వేసిన ఓట్లు కూడా ఉన్నాయనే అనుకోవాలి. ఆ ఓట్లకు పార్టీ ఓట్లు కూడా తోడయితే గెలుపుకు దగ్గరగా వెళతారు. అదే ఊపున్న పార్టీ తరపున పోటీచేస్తే గెలుపు ఖాయమని కూడా అనుకోవచ్చు. జేడీయే స్వయంగా చెప్పినట్లు బీఆర్ఎస్, వైసీపీ తరపున ఆఫర్లున్నాయి. అయితే బీఆర్ఎస్ తరపున పోటీచేస్తే పెద్దగా ఓట్లుపడే అవకాశాలు ఉండకపోవచ్చు. రాష్ట్ర విభజనకు కారణమని, తర్వాత కూడా ఆంధ్రులను అమ్మనాబూతులు తిడుతున్న కేసీయార్ అండ్ కో అంటే సీమాంధ్ర జనాల్లో బాగా మంటుంది.

కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధుల విషయంలో ఎలా స్పందిస్తారో తెలీదు. అదే వైసీపీ లేదా టీడీపీ తరపున పోటీచేసినా గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఆఫర్లు పై రెండుపార్టీల నుండే వచ్చినట్లు చెప్పారు కానీ టీడీపీ పేరు చెప్పలేదు. కాబట్టి తొందరలోనే జేడీ ఏదో పార్టీలో చేరటం ఖాయమనే అనుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News