ఆటోలో కరోనా పేషేంట్ మృతదేహం తరలింపు ..ఎక్కడంటే ?

Update: 2020-07-11 17:00 GMT
కరోనా మృతదేహాల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కరోనా రోగుల మృతదేహాల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పలు సంఘటనలు ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల జేసీబీలతో కరోనా రోగుల అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే కరోనా రోగుల మృతదేహాల తరలింపులో కూడా చాలా చోట్ల నిర్లక్ష్యం వహించారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. కరోనా తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించిన దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

మాములుగా అయితే , నిబంధనల ప్రకారం కరోనా వైరస్ సోకి మృతిచెందిన వ్యక్తి శవాన్ని అంబులెన్స్ ‌లోనే శ్మశానానికి తరలించాలి. అది కూడా ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాల్సి ఉంటుంది. అలాగే కరోనా రోగుల మృతదేహాలు తరలించే వాహనంలోని సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి. కానీ, ఈ విషయంలో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి లో మాత్రం వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఆటోలో కరోనా రోగి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడం కలకలం రేపుతోంది. డ్రైవర్ ‌తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి కూడా పీపీఈ కిట్లు ధరించకపోవడం గమనార్హం. మృతదేహం తరలింపులో ఎలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. అయితే , హాస్పిటల్ వర్గాల వాదన మరోలా ఉంది. ఒకేసారి ముగ్గురు కరోనా పేషేంట్లు చనిపోవడంతో మూడు అంబులెన్స్లు లేకపోవడం వల్ల , మృతదేహాల తరలింపు సాధ్యం కాలేదని, అందుకే ఆటోలో కరోనా మృతదేహాన్ని శ్మశానానికి తరలించినట్లు తెలిపారు.
Tags:    

Similar News