విజయసాయి క్లారిటీ : వైసీపీలో నంబర్ టూ ఆమె...?

Update: 2022-05-18 09:30 GMT
వైసీపీలో జగన్ తరువాత స్థానం ఎవరిది. ఇది చాలా కాలంగా జరుగుతున్న చర్చ. ఇక జగన్ తరువాత పేర్లలో ఎంతో మంది నాయకుల పేర్లు జత కలిపి ముచ్చట పడిన వారు ఉన్నారు. ఇక ఒక దశలో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా చోటు చేసుకున్నాయి. జగన్ తల్లి ఆ పార్టీ  గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నంబర్ టూ గా ఉంటారని కూడా అనుకున్నారు. ఆమె పేరుని నేతలు ఎక్కడా క్రమం తప్పకుండా చదువుతూ వచ్చేవారు.

అయితే ఇపుడు అంతా సీన్ పూర్తిగా  మారుతోంది.   వైసీపీలో విజయమ్మ నామస్మరణ బాగా తగ్గుతోంది. ఆమె సైతం హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు. పైగా ఆమె కుమార్తె షర్మిల తెలంగాణాలో పెట్టిన పార్టీ వైఎస్సార్టీపీలో ఎక్కువగా  కనిపిస్తున్నారు. ఇక్కడ చిత్రమేంటి ఆమె  ఈ రోజుకీ కూడా వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు. కానీ ఆమె పెద్దగా కనిపించకపోవడంతో నాయకులు కూడా ఆమె పేరు పలకడం దాదాపుగా మానేశారు.

ఇక వైస్సార్ ఫ్యామిలీకి సన్నిహితం అని అంతా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనను రెండవమారు రాజ్యసభకు నామినేట్ చేసినందుకు అధినాయకత్వానికి తాజాగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జగన్ తో పాటు ప్రత్యేకంగా వైఎస్ భారతి పేరు కూడా ప్రస్థావించారు. ఇదే ఇపుడు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది.

వైఎస్ భారతి పేరుని ఇప్పటిదాకా ఏ అగ్ర నాయకుడు కూడా అఫీషియల్ గా చేర్చి మాట్లాడలేదు. పైగా పార్టీ యాక్టివిటీస్ లో ఆమె పాత్ర గురించి ఎవరూ పెద్దగా మాట్లాడేది ఉండదు కూడా.  కానీ విజయసాయిరెడ్డి మాత్రం తన పదవి రెండవసారి రెన్యూవల్ కావడం వెనక జగన్ తో పాటు భారతి కూడా ఉన్నారని భావించి ఆమెకు ధన్యవాదాలు తెలియచేశారు అనుకోవాలి.

ఆ విధంగా వైఎస్సార్ ఇంటి మనిషిగా పేరున్న విజయసాయిరెడ్డి భారతి పేరుని ఊరకే ప్రస్థావించరు కదా అని కూడా అంటున్నారు. అంటే ఆమె వైసీపీలో కీలకంగా ఉన్నారని అన్యాపదేశంగా విజయసాయిరెడ్డి చెప్పారనే అంటున్నారు. రేపటి రోజున జగన్ తరువాత ఆమె నంబర్ టూ అని కూడా సందేశం ఇచ్చారని భావిస్తున్నారు. అదే సమయంలో వైఎస్ విజయమ్మ పేరుని విజయసాయిరెడ్డి ఎందుకు తలచుకోలేదు అన్న ప్రశ్న కూడా వస్తోంది.

ఆమె పార్టీ యాక్టివిటీస్ ని తగ్గించారు కాబట్టే పేరు చెప్పలేదు అనుకున్నా ఆమెకు వైసీపీతో గ్యాప్ ఉందన్న ప్రచారం నిజమని అనుకున్నా అంతా విజయసాయిరెడ్డి కృతజ్ఞతల ప్రకటనలో అర్ధాలు వెతుక్కోవాల్సిందే.  ఏది ఏమైనా రాజ్యా సభ సీట్ల ఎంపిక కంటే సంచలనంగా విజయసాయిరెడ్డి ధన్యవాదాల ప్రకటన మారింది అంటున్నారు. ఏతా వాతా తేలేది ఏంటి అంటే వైసీపీలో జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా అత్యంత కీలకం అని. నోట్ దిస్ పాయింట్ వైసీపీ నేతలూ అన్నదే విజయసాయిరెడ్డి వారి సందేశం అనుకోవాలని అంటున్నారు.
Tags:    

Similar News