టీడీపీ చేసిన తప్పులే చేస్తున్నావ్ జగన్!

Update: 2019-08-08 05:27 GMT
రాష్ట్రంలోని సమస్యలు తీర్చాలంటూ  ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బాట పట్టారు.  వరుసగా రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి - హోమంత్రి అమిత్ షా - ఇతర కేంద్రమంత్రులను కలుస్తూ వారికి రాష్ట్ర సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నారు. పరిష్కరించాలని కోరుతున్నారు.

అయితే ఆంధ్రాకే చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జగన్ నిన్న భేటి అయ్యారు. వెంకయ్య అధికార నివాసానికి వెళ్లిన సీఎం జగన్ మోహన్ రెడ్డి   ఆయనను మార్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎంతోపాటు వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు.

వెంకయ్యతో భేటిలో జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన వ్యక్తిగా మీరు పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడానికి మీ పరపతితో సహకరించాలని కోరినట్టు తెలిసింది. అయితే దీనికి వెంకయ్య ‘ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు నెరవేర్చేందుకు నా వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని’ హామీ ఇచ్చినట్టు సమాచారం.

అయితే ఈ సందర్భంగా జగన్ తో భేటిలో వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆ పార్టీ పరాజయం పాలైందని.. మీరు కూడా అవే తప్పులు చేసి టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారని  జగన్ కు వెంకయ్య నాయుడు సుతిమెత్తగా  హెచ్చరించినట్టు సమాచారం. రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా కాకుండా విధ్వంసక రీతిలో పనిచేస్తే సాయం చేయడం కష్టమని ఆయన కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది.
Tags:    

Similar News