వెంక‌య్య‌కు...ఉప‌రాష్ట్రప‌తి ప‌దవి సూట్ కాలేదే!

Update: 2017-12-31 11:42 GMT
ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు... మొన్న‌టిదాకా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్న ఈ తెలుగు రాజ‌కీయ వేత్త‌... జాతీయ స్థాయిలో మంరి వాగ్దాటితో పాటు చ‌తుర‌త ఉన్న నేత‌గా గుర్తింపు పొందారు. బీజేపీ స‌ర్కారు అధికారంలో ఉన్న‌ప్పుడ‌ల్లా.... కీల‌క మంత్రి ప‌ద‌విలో ఉండే వెంక‌య్య‌... త‌న‌దైన శైలిలో రాణించారు. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా వెంక‌య్య‌కు సాటి రాగ‌ల నేత మ‌రొక‌రు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. విప‌క్షాల‌ను సింగిల్ హ్యాండెడ్‌గా నిలువ‌రించ‌గ‌లిగిన నేత‌గా గుర్తింపు సాధించిన వెంక‌య్య‌... విప‌క్షంలో ఉంటే ఒంటి చేత్తోనే అధికార పక్షానికి చుక్క‌లు చూపించ‌గ‌ల‌రు. అయితే ఇదంతా గ‌త‌మే. ఎందుకంటే బీజేపీ అధిష్ఠానం నిర్ణ‌యం మేర‌కు యాక్టివ్ పాలిటిక్స్‌కు రాంరాం ప‌లికేసిన వెంక‌య్య‌... ఇప్పుడు భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అస‌లు యాక్టివ్ పాలిటిక్స్‌ను వ‌దిలేందుకు త‌న‌కు ఎంత‌మాత్రం ఇష్టం లేద‌ని, అంతేకాకుండా రాజ్యాంగ ప‌దువులైన రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వుల‌కు తాను స‌రిపోనంటూ గ‌తంలో వెంక‌య్య చాలా సార్లు చెప్పిన వ్యాఖ్య‌లు కూడా మ‌రువ‌లేనివే.

అయితే నిబ‌ద్ధ‌త క‌లిగిన రాజ‌కీయ నేత‌గా, బీజేపీ అధిష్ఠానం ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించిన వెంక‌య్య క్రియాశీల రాజ‌కీయాల‌కు రాజీనామా చేసేసి... ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విలో కూర్చుండిపోయారు. మ‌రి ఇష్టం లేని స‌ద‌రు ప‌ద‌విలో వెంక‌య్య ఏ మేర న‌లిగిపోతున్నార‌ని ఆరా తీస్తే... ప్ర‌స్తుతం స‌వాల‌క్ష ప్రొటోకాల్ నియ‌మాలు క‌లిగిన ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విలో నిజంగానే వెంక‌య్య సంతృప్తిగా లేర‌నే చెప్పాలి. అయితే దేశంలోనే రెండో అతి పెద్ద ప‌ద‌విలో కూర్చున్న వెంక‌య్య‌... ఆ అసంతృప్తిని బ‌య‌ట ప‌డ‌నీయండా చాలా జాగ్ర‌త్త‌గా నెట్టుకుని వ‌స్తున్నారు. మ‌నుసులోని అసంతృప్తిని ఎంత‌గా బిగ‌బ‌ట్టినా.. దానిని బ‌య‌ట‌కు రానీయ‌కుండా ఆప‌డం దాదాపుగా అసాధ్య‌మ‌నే చెప్పాలి. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... అలాంటి అసంతృప్తిని వెంక‌య్య బ‌య‌ట‌పెట్టేశారు. ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వితో తాను ఎంత‌గా ఇబ్బంది ప‌డుతున్నాన‌న్న విష‌యాన్ని వెంక‌య్య ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. నేడు అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా మీడియాతో చిట్‌ చాట్‌ గా మాట్లాడిన వెంక‌య్య‌... పలు అంశాల‌పై త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేశారు.

ప్ర‌స్తుత రాజ‌కీయాల‌న్నీ డ‌బ్బు - కులం - వ‌ర్గం త‌దిత‌ర అంశాల‌తో ముడిప‌డి పోయాయ‌ని వెంక‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా సంస్కృతి త‌న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తోంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. తాను ప్ర‌ధాని ప‌ద‌విని కోరుకోలేద‌ని, ఆ ప‌ద‌వికి త‌గిన అర్హ‌త కూడా త‌న‌కు లేద‌ని కూడా వెంక‌య్య చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి త‌న‌ను ఇబ్బంది పెడుతున్న వైనాన్ని కూడా ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వికి ఉన్న సుదీర్ఘ ప్రొటోకాల్ నియ‌మాలు అప్పుడ‌ప్పుడూ త‌న‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌ని, త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన వారిని  క‌లిసే విష‌యంలోనూ ఈ త‌ర‌హా నిబంధ‌న‌లు త‌న‌కు అడ్డుగా వ‌స్తుండ‌టం నిజంగానే త‌న‌ను బాధిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.
Tags:    

Similar News