ఇప్పుడా కళ్లు తెరిచేది వెంకయ్యా..?

Update: 2015-12-01 08:52 GMT
వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసేయటం.. పరిణామాల గురించి పట్టించుకోకపోవటం బీజేపీ నేతలకు అలవాటే. బంపర్ మెజార్టీతో అధికారంలో వచ్చిన తర్వాత.. తమపై వ్యూహాత్మకంగా దాడి చేయటానికి.. హిందుత్వ బూచితో రాజకీయంగా దెబ్బ తీస్తూ.. లేనిపోని గందరగోళాల్ని సృష్టించే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించటంతో కమలనాథులు చాలానే తప్పు చేశారు. లౌకికవాదుల పేరిట చలామణి అయ్యే వారు.. తమను దెబ్బ తీసేందుకు ‘హిందుత్వ’ పేరుతో దాడి చేస్తారన్న అంచనా మొదటి నుంచి ఉంది. అయితే.. వాటి గురించి పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించిన బీజేపీ అగ్రనేతలు ఇప్పుడు ఒక్కసారిగా మేల్కొన్నారు.

గొడ్డు మాంసం కావొచ్చు.. దేశంలో మత అసహనం తీవ్రస్థాయిలో పెరిగిపోయిందన్న ఆందోళన కావొచ్చు.. సమస్య మొదలైనప్పుడే దానిపై పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చేసి.. ఆయా వివాదాలతో తమకు సంబంధం లేదని చేతులు దులుపుకోవాల్సింది పోయి.. మాటకు మాట అనేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఇలాంటి వ్యాఖ్యల కారణంగా రెచ్చగొట్టే వాళ్లు పక్కకు వెళ్లిపోతారని.. రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసే వాళ్లు అడ్డంగా బుక్ అవుతారన్న విషయం కమలనాథులకు ఇప్పుడు అర్థమైనట్లు ఉంది. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో చోటు చేసుకున్న అంశాలు చూస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ సమావేశంలో మాట్లాడిన బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్య నాయుడు.. పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని.. వాడే భాష విషయంలో నియంత్రణ అవసరమని సభ్యులకు ఉద్బోదించటమే దీనికి నిదర్శనం. బీజేపీ నేతలు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే.. దాని ప్రభావం ప్రధాని మోడీ మీద పడుతుందని ఆయన చెప్పినట్లుగా ఆ పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పుకొచ్చారు. మరి.. ఈ ఏడుపేదో మొదటే ఉంటే.. పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు కదా. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో.
Tags:    

Similar News