కమ్ కమ్ ఇన్ కమ్ : అటు ఎర్ర చందనం వేలం...ఇటు మద్యం లాభం

Update: 2022-07-26 14:30 GMT
ఏపీ సర్కార్ ఇపుడు ఒక్కటే పాట పాడుతోంది. కమ్ కమ్ ఇన్ కమ్ అంటోంది. ఏ రూపంలో అయినా ఆదాయం సమకూరాలి. ఖజానా కళకళలాడాలి. అసలే అప్పులు తేగలినన్ని తెచ్చేసి ఇక ఇవ్వం బాబోయ్ అని వివిధ ఏజెన్సీలు ముఖాన చెప్పేస్తున్న వేళ చేతిలో  ఏపీలో ఉన్న ఆదాయ మార్గాలు ఏమిటి అని అన్వేషించే పనిలో వైసీపీ సర్కార్ పడింది. మరి నెత్తికెత్తుకున్న భారం చిన్నదా. ఏటా యాభై వేల కోట్లు కేవలం సంక్షేమ పధకాలకే పోతుంది. ఉద్యోగుల జీతాలు, ఇతర అవసరాలు అన్నీ చూడాలి అంటే ఏటా సర్కార్ కి లక్షన్నర పై చిలుకు ఖర్చు అవుతోంది.

అయితే ఈ రోజుకు స్టేట్ ఆదాయం ఎనభై వేల కోట్లు గా ఉంది. కేంద్రం నుంచి వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చూస్తే మరో ముప్పయి వేల కోట్ల దాకా జమ అవుతోంది. అంటే ఎలా చూసుకున్నా లక్షా పది వేలకు మించి ఆదాయం రావడం లేదు. మరి నలభై వేల కోట్లు ప్రతీ ఏటా డెఫిసిట్ వస్తోంది. దాంతో పాటు ఇంకా అదనపు ఖర్చులు తగిలితే తడిసి మోపెడు అవుతోంది. దాంతో అప్పులు చేస్తూనే మరో వైపు ఉన్న ఆదాయ మార్గాలను కూడా పెంచుకునే మార్గం వెతుకుతోంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో కీలకమైన శాఖల నుంచి వచ్చే ఆదాయం మీద ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గనుల శాఖ బంగారు బాతుగుడ్డు మాదిరిగా ఉందని సర్కార్ భావిస్తోంది. గత మూడేళ్లుగా ఎర్ర చందనం స్టాక్ వేలం వేయకుండా అలాగే మిగిలి ఉంది. దాంతో దాన్ని వేలం వేయడం ద్వారా వందల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కార్ అర్జంట్ గా ఆరాటపడుతోంది.

అయితే ఎర్రచందనానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దాన్ని వేలం వేయాలీ అంటే కేంద్రం అనుమతులు ఇవ్వాలి. దాంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయడానికి ఏపీ అధికారులు సిద్ధపడుతున్నారు. మరో వైపు చూస్తే మద్యం ఆదాయం గణనీయంగా ఈసారి వస్తుందని తీపి కబురు ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. కొత్తగా 840 బార్లకు అనుమతులు ఇవ్వడంతో ఈసారి పాతిక వేల కోత్ల పై చిలుకు నుంచి ముప్పై వేల కోట్లుగా మద్యం ఆదాయం జమ అవుతుంది అని లెక్కలేస్తున్నారు.

అలాగే రిజిస్ట్రేషన్ విభాగం నుంచి ఆదాయం వచ్చే మార్గాలను కూడా చూడాలని, ఎక్కడా ఒక్క పైసా దారి మళ్ళడానికి వీలు లేదని, అంతా పక్కాగా  వసూల్ కావాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, గనులు  అటవీ శాఖ వంటి అనేక ఇతర శాఖల నుండి అదనపు ఆదాయాన్ని పెంచే అవకాశాలను కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా పన్నుల వసూళ్లలో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత ఉండేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

పన్ను ఎగవేత, నకిలీ బిల్లుల వినియోగాన్ని అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి డేటా అనలిటిక్స్ సెంటర్‌ను పటిష్టం చేస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు.

మొత్తానికి చూస్తే ఆదాయం అంతా ప్రవహించాల్సిందే అది సక్రమంగా సర్కార్ వారి ఖజానాకు చేరాల్సిందే అని వైసీపీ పెద్దలు హుకుం జారీ చేస్తున్నారు. మరి ఆదాయం ఇంతలా పెరిగితే మంచిదే కానీ అలా వచ్చిన దానిని అభివృద్ధికి ఖర్చు చేయకుండా పంచుడుకు వెచ్చిస్తే మాత్రం ఏపీ ప్రగతి గతి దారి తప్పుతుందని అంటున్నారు.
Tags:    

Similar News