కో-లివింగ్ హాస్టల్స్ లో ఆ పనులు.. హైదరాబాద్ లో ఐదుగురి అరెస్ట్

అయితే ఇటీవలి కాలంలో నగరంలో వేగంగా విస్తరిస్తున్న కోలివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అక్రమ కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.;

Update: 2025-12-23 07:34 GMT

హైదరాబాద్ మహానగరం అంటేనే అవకాశాల అడ్డా.. ఇక్కడ ఉపాధి కోసం వచ్చినవారు ఎందరో.. వసతులు లేక కోలివింగ్ హాస్టల్స్ లోనూ కలిసి ఉంటూ పనులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల వారికి భద్రత, భరోసా దక్కుతుందన్న భావన వారిలో ఉంది. హైదరాబాద్ మహానగరం ఆధునిక పోకడలతో రోజురోజుకు విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగ అవకాశాలకు కేంద్రబిందువుగా మారడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు నగరానికి తరలివస్తున్నారు. అంతర్జాతీయ టెక్ కంపెనీలు, ఐటీ హబ్ లు, విద్యాసంస్థలు కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండడంతో చాలా మంది హాస్టల్స్, పీజీలు, కోలివింగ్ హాస్టల్స్ లో నివసించేందుకు మొగ్గుచూపుతున్నారు.

అయితే ఇటీవలి కాలంలో నగరంలో వేగంగా విస్తరిస్తున్న కోలివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అక్రమ కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్ లోని రాయదుర్గ్ ప్రాంతంలో ఉన్న పలు కోలివింగ్ హాస్టల్స్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. రాయ్ దుర్గ్ లోని కోలివ్ గార్నెట్ పీజీని కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున మత్తుపదార్థాల సరఫరా జరుగుతున్నట్టుగా రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. నిఘా పెంచిన పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ సరఫరాదారులతో పాటు వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడుల్లో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనంచేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన వంశీ దిలీప్, బాలా ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. అలాగే డ్రగ్స్ వినియోగిస్తున్న హైదరాబాద్ కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్ లను కూడా అరెస్ట్ చేశారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కో లివింగ్ హాస్టల్స్ , పీజీ హాస్టల్స్ ను కేంద్రంగా చేసుకొని యువకులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. రాయదుర్గ్ తోపాటు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా కుప్పలుతెప్పలుగా కోలివింగ్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారని.. వీటిపై ప్రత్యేక నిఘా అవసరమని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. కోలివింగ్ హాస్టల్స్ లో భద్రత, పర్యవేక్షణ లోపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువతను మత్తుపదార్థాల బారిన పడకుండా కట్టడి చేయాలంటే హాస్టల్స్ నిర్వహణపై కఠిన నియమాలు, తరచూ తనిఖీలు అవసరమని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

Tags:    

Similar News