కేసీఆర్‌కు సిట్ నోటీసులు? రేవంత్ సర్కార్ 'రివర్స్ అటాక్'!

కేసీఆర్ సైలెంట్ గా ఉన్నంతవరకూ కాంగ్రెస్ కూడా తన పని తాను చేసుకుంటూ సాగింది.;

Update: 2025-12-23 07:36 GMT

కేసీఆర్ సైలెంట్ గా ఉన్నంతవరకూ కాంగ్రెస్ కూడా తన పని తాను చేసుకుంటూ సాగింది. కానీ కేసీఆర్ బయటకు రావడం.. కాంగ్రెస్ పై విమర్శల బాంబులు వేయడం తో కాంగ్రెస్ కూడా ఎదురుదాడికి రెడీ అవుతోంది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన మొదలైంది. గత కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్ లో చేసిన ‘పాలమూరు-రంగారెడ్డి’ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. అయితే కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ సర్కార్ ‘ఫోన్ ట్యాపింగ్’ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైందనే ప్రచారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో గతకొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలకు కేవలం మాటలతో కాకుండా.. చట్టపరమైన చర్యలతో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.

ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా..

ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం.. గత ప్రభుత్వంలోని ముఖ్యనేతల ఆదేశాల మేరకే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశామని ఆయన వెల్లడించినట్టు సమాచారం. ఈ వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగులు వేస్తున్నాయి.

నోటీసుల దిశగా ‘సిట్’ అడుగులు

హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ వ్యవహారంపై సుధీర్ఘంగా విచారణ జరుపుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. కేసీఆర్ తోపాటు గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా నోటీసులు అందనున్నాయి. ఇందులో హరీష్ రావు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. నిజనిజాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాజకీయ వ్యూహమా? చట్టపరమైన చర్యలా?

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టేప్రయత్నం కేసీఆర్ చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి జరగాల్సిన నష్టాన్ని నివారించేందుకు పాత కేసులను తిరగదోడడం ద్వారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయాలనేది రేవంత్ సర్కార్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘తప్పుచేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు’ అని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు నోటీసుల వార్త ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని సంకేతాలిస్తోంది.

కేసీఆర్ బహిరంగంగా స్పందించడంతో వెంటనే ఈ నోటీసుల అంశం తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కు నోటీసులు అందితే అది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒకకీలకమైన మలుపు కానుంది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నాయి.

రాబోయే రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News