హాట్ టాపిక్: ఏడారి దేశంలో మంచు.. కియామత్ కు సంకేతాలా?

ఏడారి దేశంగా చెప్పే సౌదీలో గడిచిన కొన్ని నెలలుగా చిత్ర.. విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-23 05:00 GMT

ఏడారి దేశంగా చెప్పే సౌదీలో గడిచిన కొన్ని నెలలుగా చిత్ర.. విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో విరుచుకుపడుతున్న వరదలు..ఈ మధ్యన మంచు దుప్పటి కమ్మేస్తున్న వైనంతో అరబ్ దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భరించలేని వేడి వాతావరణం. పొడిగా ఉండే దేశంలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. కొందరు ఈ పరిణామాల్ని సైన్స్ కోణంలో చూస్తే.. మరికొందరు తాము నమ్మే దైవం రూపంలో చూస్తున్నారు. ఈ సందర్భంగా తమ మత గ్రంధాల్లోని అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా మారిన వాతావరణ పరిస్థితులు హాట్ చర్చకు తెర తీస్తున్నాయని చెప్పాలి.

ఇటీవల కాలంలో సౌదీలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వరదలతో పలు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా మంచు దుప్పటి ఏడారి దేశాన్ని కమ్మేస్తున్న వైనం ప్రజల్లో ఆశ్చర్యాన్ని మాత్రమే కాదు.. ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. సౌదీలోని తుబుక్ ప్రావిన్స్ లోని పర్వత శ్రేణులు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాయి. అక్కడ 2600 మీటర్ల ఎతతులో ఉన్న ట్రొజెనాపై మంచుతో పాటు వర్షం కురిసింది. హెయిల్ ప్రాంతంలోనూ ఇలాంటి సీనే కనిపిస్తోంది. చలి గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

ఈ సందర్భంగా గతంలోకి వెళ్లాలని.. చరిత్రలో ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? అన్న సందేహం కలుగుతుంది. వీటికి సమాధానం వెతికేందుకు హిస్టరీ లోతుల్లోకి వెళితే కొన్ని ఆశ్చర్యకర అంశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఏడారి దేశంగా ఉన్న ఈ ప్రాంతం సుమారు 6వేల ఏళ్లు - పది వేల ఏళ్ల క్రితం పచ్చిక మైదానాలు.. నదులు.. సరస్సులు.. జంతువులతో నిండి ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి పరిస్థితిని ‘గ్రీన్ అరేబియా పిరియడ్’గా పేర్కొంటారు. అందరూ సౌదీ అంటే ఏడారి అంటారు. చరిత్ర లోతుల్లోకి వెళితే అది పూర్తి నిజం కాదన్న కొత్త విషయం అర్థమవుతుంది.

మరీ అంత వెనక్కి వెళ్లకుండా గడిచిన వంద-నూట యాభైఏళ్లలో పరిస్థితేంటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. మంచు పడటం.. వరదలతో ఉక్కిరిబిక్కిరి కావటం లాంటివి అరుదుగా చోటు చేసుకున్నాయని చెప్పాలి. అయితే.. ఇటీవల కాలంలో ఇలాంటివి తరచూ చోటు చేసుకోవటం అక్కడి ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన యాభై ఏళ్లలో చూస్తే తొలిసారి 2005-10 మధ్య తొలిసారి అనూహ్య రీతిలో భారీ వర్షాలు కురిసాయి. జెడ్డా ప్రాంతం వరదలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

అదే సమయంలో 2015-20 మధ్యలో తరచూ వరదలు పెరగటం.. చలికాల తీవ్రత ఎక్కువ కావటం మొదలైంది. వాతావరణ మార్పులు గమనించదగ్గ స్థాయికి చేరుకున్నాయని చెప్పాలి. 2020 తర్వాత మంచు కురవటం.. ఏడారుల్లో నీళ్లు నిలవటం.. పచ్చదనం పెరగటం లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఏడారి దేశంలో వాతావరణంలో విచిత్రమైన మార్పులు గడిచిన ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో వేగంగా చోటు చేసుకున్నాయని చెప్పాలి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఏడారి దేశం మీద స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి.

ఇక్కడే.. మరో ఆసక్తికర చర్చకు తెర తేసినట్లైంది. కొందరు ఈ పరిస్థితిని సైన్స్ కోణంలో చూస్తే.. మరికొందరు మత విశ్వాసాలతో మాట్లాడటం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేస్తే.. ముస్లింల పవిత్ర గ్రంధంలో ప్రస్తావించిన ‘కియామత్’ సంకేతాలుగా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి. అదేమంటే.. కియామత్ పేరుతో భయానికి గురి చేయకూడదు. విషయాల్ని చాలా జాగ్రత్తగా ప్రస్తావించాల్సి ఉంటుంది.

ఇంతకూ కియామత్ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్లాం చెప్పేదేమంటే.. ఈ ప్రపంచ వ్యవస్థ పూర్తిగా ముగిసే రోజుగా చెప్పాలి. అన్ని మతాల్లో ప్రస్తావించినట్లే.. ఇస్లాంలోనూ దీని ప్రస్తావన ఉంది. కియామత్ కు సంబంధించి ఇస్లాం ఏం చెబుతుందంటే.. ‘ప్రపంచం ఒక్క రోజులో ముగియదు. దానికి ముందు కొన్ని మార్పులు.. హెచ్చరికలు.. అసాధారణ పరిణామాలు కనిపిస్తాయి. ఇదే కియామత్ సంకేతాలు’ అంటూ చెబుతుంటారు. దీనికి సంబంధించిన సంకేతాల్ని చూస్తే.. ప్రకృతి అస్థిరంగా మారటం.. అసాధారణ స్థాయిలో వర్షాలు.. వరదలు.. ఏడారుల్లో పచ్చిక.. మానవ విలువల క్షీణతగా పేర్కొంటారు. ఇది నెమ్మదిగా మొదలవుతుంది. శతాబ్దాలు కొనసాగుతాయి. ఇప్పుడు చూస్తున్న మార్పులు చిన్న సంకేతాలుగా అభివర్ణిస్తున్నారు. మతం.. సైన్స్ రెండింటిని కలగలిపి.. ఒక్క మాటలో తాజా పరిస్థితిని చెప్పాల్సి వస్తే.. ‘‘ప్రపంచవ్యవస్థలో అసమతుల్యత పెరుగుతున్న సూచనలు’’గా అభివర్ణించాలి.

Tags:    

Similar News