బంగ్లాకు చికెన్ నెక్ సర్జరీ.. మెడ గట్టిగా విరచాలంటే ఇదే మార్గం
మొత్తంగా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు బంగ్లాదేశ్. కానీ, ఏనుగు లాంటి భారత దేశాన్ని సవాల్ చేస్తోంది.;
‘భారత్ కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు. వాటికి సముద్ర మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే బాడీ గార్డ్స్.. చైనా ఆర్థిక బేస్ ను విస్తరించుకోవచ్చు’ ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మొహమ్మద్ యూనస్ వ్యాఖ్యలు ‘భారత ఈశాన్య రాష్ట్రాలను దాని నుంచి వేరుచేస్తాం’ తాజాగా బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా రెచ్చగొట్టే మాటలు.
మొత్తంగా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు బంగ్లాదేశ్. కానీ, ఏనుగు లాంటి భారత దేశాన్ని సవాల్ చేస్తోంది. అసలు బంగ్లాకు వచ్చిన సమస్య ఏమిటి? అంటే ఆ దేశంలో జనాభా ఎక్కువ. వనరులు తక్కువ. అందుకే భారత్ పై ద్వేషంతో ఏడుస్తుంటారు అక్కడి నాయకులు. చికెన్ నెక్ ప్రాంతాన్ని అలుసుగా తీసుకుంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా బంగ్లాలో అశాంతి నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంతో సరిహద్దులున్న అసోం సీఎం హిమంత విశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బంగ్లాదేశ్ తో మాటల్లేవని.. సర్జరీ చేయాల్సిందేనని పేర్కొన్నారు.
ఏమిటీ చికెన్ నెక్?
భారత్ లోని పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చేరేందుకు ఉన్న మార్గం చికెన్ నెక్. వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతం. కొన్నిచోట్ల కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. సన్నగా కోడి మెడ తరహాలో ఉండే కారణంగా దీనిని చికెన్ నెక్ అని పిలుస్తుంటారు. ఈ మార్గాన్నిఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలతో మనకు సంబంధాలు తెగిపోతాయి. దీన్ని కాపాడుకునేందుకే.. ఇప్పుడు ఇతర మార్గాలను అనుసరించాలని హిమంత సూచిస్తున్నారు.
సిలిగురి.. గురి తప్పకుండా..
బెంగాల్ లోని సిలిగురి ప్రాంతంలో ఉండే చికెన్ నెక్ అటు నేపాల్, ఇటు భూటాన్ కూడా అతి సమీపం. దీనికి అత్యంత దగ్గరగా ఉండే చుంబీ లోయ చైనాకు చెందినది కావడం గమనార్హం. అందుకే ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందనేది నిపుణుల మాట. ఒకవేళ ఏదైనా జరిగితే.. ఏడు ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు తెగిపోవడమే కాదు.. సైనిక దళాలకు సరఫరాలు దుర్లభం అవుతాయి. ఇప్పటికే దోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణాలు చేపట్టగా భారత్ అడ్డుకుంది. డోక్లాంను చైనా కబళించాలని చూస్తోంది. అందుకే.. పరిస్థితి చేయి దాటకముందే భారత్ చికెన్ నెక్ పై ఓసారి ఫోకస్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరి ఉద్దేశంలో చికెన్ నెక్ విస్తరించేలా.. బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపేసుకోవడం అని. కానీ, భారత్ కు ఎప్పుడూ అలాంటి చర్యలకు పాల్పడిన చరిత్ర లేదు.