టీటీడీ మాజీ చైర్మన్ కుమారుడు, కుమార్తె అరెస్ట్.. హత్య కేసులో సీబీఐ ఎంట్రీ!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజ ను తాజాగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.;
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజ ను తాజాగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అప్పటి డీఎస్పీ మోహన్ ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని నేడు న్యాయస్థానంలో హాజరుపరచనున్నారని అంటున్నారు.
అవును... ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజ ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2019 మే నెలలో బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్ లో రఘునాథ్ ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. అయితే.. తన భర్తది ఆత్మహత్య కాదని.. ఆయనను కిడ్నాప్ చేసి, హత్య చేశారని.. ఆత్మహత్యగా చిత్రీకరించారని రఘునాథ్ భార్య మంజుల బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులో డీకే శ్రీనివాస్ తో పాటు దామోదర్, రామచంద్రయ్య, ప్రతాప్ అనే వ్యక్తుల పేర్లను ఆమె పొందుపరిచారు! ఈ కేసులో.. నకీలీ స్టాంప్ పేపర్లు ఉపయోగించి, రఘునాథ్ ఆస్తిని రాయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ కేసుపై అప్పట్లో ఇనిస్పెక్టర్ గా ఉన్న మోహన్ దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా... రఘునాథ్ ది ఆత్మహత్యే అని కోర్టుకు రిపోర్ట్ సమర్పించారు.
అయితే దీనిపై రఘునాథ్ భార్య వెంటనే హైకోర్టును ఆశ్రయించారు.. ఈ నేపథ్యంలో హైకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే.. సిట్ కూడా రఘునాథ్ ది ఆత్మహత్యే అని రిపోర్ట్ ఇచ్చింది. దీంతో.. రఘునాథ్ భార్య మంజుల మరోసారి హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు చెన్నై సీబీఐ విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.
ఈ దర్యాప్తులో భాగంగానే.. సీబీఐ అధికారులు డీఎస్పీ గా ఉన్న మోహన్ తో పాటు డీకే శ్రీనివాస్, కల్పజ లను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ రోజు న్యాయస్థానంలో హాజరుపరుస్తారని అంటున్నారు.