పోయేకాలం కాకపోతే.. యూపీ మంత్రి నోటి నుంచి అలాంటి మాటా?

Update: 2021-10-22 14:30 GMT
ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఎక్కువ అవుతోంది. మొన్నటికి మొన్న కమలం పార్టీకి చెందిన కేంద్రమంత్రి కొడుకు ఒకరు.. తాను ప్రయాణిస్తున్న వాహనంతో ఆందోళన చేస్తున్న రైతుల్ని తొక్కించేసి.. ప్రాణాలు తీసిన వైనం తెలిసిందే. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.న ఇదిలా ఉంటే.. తాజాగా యూపీకి చెందిన మరో మంత్రి ఒకరు తన నోటికి పని చెప్పారు. అర్థం లేని మాటలు మాట్లాడుతూ.. ఎప్పుడో జమానా కిందటి మాటల్ని చెప్పి షాకిచ్చాడు. ఇప్పటికే అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలతో కాక మీద ఉన్న ప్రజలకు మరింత ఒళ్లు మండేలా ఆయన మాటలు ఉన్నాయి.

దేశంలో 95 శాతం మందికి అసలు పెట్రోలే అవసరం లేదని యూపీ మంత్రి ఉపేంద్ర తివారి వ్యాఖ్యానించారు. పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరల గురించి అడిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించిన మంత్రివర్యులు ఈ తరహాలో వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరలు పెరిగిపోవటం నిజమే కానీ ఫోర్ వీలర్ ఉన్న కొద్ది మందికే పెట్రోల్ అవసరం ఉందన్నారు. సమాజంలో 95 శాతం ప్రజలకు పెట్రోల్ అవసరమే లేదన్నారు. మంత్రిగారి లెక్కలో కార్లలో తప్పించి టూవీలర్లలో పెట్రోల్ కాక మరేం వాడతారు?

నిజానికి ఆయన్ను తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? నిత్యం ప్రజలు కట్టిన పన్ను ఆదాయంతో వచ్చిన సౌకర్యాల్ని అనుభవిస్తూ.. ప్రభుత్వ కారులో తిరిగే ఆయనకు సామాన్యులు వాడే టూవీలర్లు గుర్తుకు రావాల్సిన అవసరమే లేదు. ఇక..కార్ల విషయానికి వస్తే.. తనలాంటి పలుకుబడి ఉన్నోళ్లు..సంపన్నులు మాత్రమే వాడాలన్న భావనలో ఉండే ఈ తరహా నేతలకు.. సామాన్యుల కష్టాలు తెలిసే అవకాశమే లేదు. ఇక.. పెరిగిన నిత్యవసరాల ధరల్ని సైతం ఆయన సమర్థించే ప్రయత్నం చేయటం గమనార్హం.

95 శాతం ప్రజలకు పెట్రోల్ అవసరమే లేదన్న మంత్రిగారికి.. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయన్న దానికి ఫీలయ్యే ప్రసక్తే ఉండదు కదా? ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. ఉచితంగా మందులు ఇస్తున్న ప్రభుత్వం వాటి ఖర్చును ఎలా భరిస్తుందని రివర్సులో ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటానికి ఎలాంటి అంశాలు లేకపోవటంతో ఇలా మాట్లాడి గగ్గోలు పెడుతున్నాయన్నారు. ప్రధాని మోడీ.. యూపీ ముఖ్యమంత్రి యోగి కారణంగా దేశంలోని ప్రజల ఆదాయంరేటు గణనీయంగా పెరిగిందన్నారు. చూస్తుంటే.. మంత్రిగారికి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు.. ఆ ముఖ్యమంత్రులు సైతం లెక్కలోకి తీసుకోనట్లుగా ఉన్నారు.




Tags:    

Similar News