30 ఏళ్లు జగనే సీఎం.. ఇలా చేస్తే నో డౌట్

Update: 2019-05-27 08:54 GMT
వైఎస్ జగన్ తీసుకున్న స్టెప్పులు - నిర్ణయాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మెచ్చుకున్నారు. పక్కరాష్ట్రం సీఎం కేసీఆర్ తో సాన్నిహిత్యం.. అప్పుల్లో ఉన్న ఏపీకి కేంద్ర సాయం కోసం మోడీని గెలవగానే కలవడం ఏపీలో చర్చనీయాంశమవుతోంది. ఈ రెండు చర్యలు ఏపీకి మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇప్పుడు ఉండవల్లి కూడా జగన్ గెలవగానే తీసుకున్న నిర్ణయాలు..వేసిన అడుగులు ఎంతో మంచివని పొగిడేశారు.

కేరళలో అవినీతి జరగకుండా అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వైఎస్ జగన్ ఒకవేళ ఏపీలో అమలు చేస్తే మరో 30 ఏళ్లు ఏపీ సీఎంగా కొనసాగుతారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ జగన్ గురించి పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో జగన్ ప్రధాని మోడీ - కేసీఆర్ లతో సాన్నిహిత్యంగా ఉండడమే మంచిదని.. అందుకే జగన్ తీసుకున్న స్టెప్ చాలా మంచిదని ఉండవల్లి కొనియాడారు. ఢిల్లీ జగన్ మాట్లాడిన తీరు చూస్తే తనకు భవిష్యత్ పై విశ్వాసం కలుగుతోందన్నారు. ఆయన తండ్రి దివంగత వైఎస్సార్ గుర్తుకు వచ్చాడని పేర్కొన్నారు. పాలనలో అవినీతికి తావులేకుండా జగన్ పాదర్శకత పాలన అందిస్తానని ప్రకటించడం శుభపరిణామమన్నారు.

ఏపీ ఎన్నికల చరిత్రలో 50 శాతం  ఓట్లు ఏ పార్టీకి పడలేదని.. చరిత్రలో వైసీపీ ఒక్కటే ఈ ఘనత సాధించిందని ఉండవల్లి ఘనంగా చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ఇంతటి ప్రజాభిమానాన్ని సంపాదించడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. మొత్తంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముందే తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం అందరిచేత ప్రశంసలు కురిపిస్తున్నాయి.
Tags:    

Similar News