రాజీనామా సీక్రేట్స్...మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ కి తొందరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటి సమయంలో హఠాత్తుగా గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా చేశారు.;
పశ్చిమ బెంగాల్ కి తొందరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటి సమయంలో హఠాత్తుగా గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా చేశారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారు అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే కేంద్రం నియమించిన గవర్నల పదవీ కాలం అయిదేళ్ళు అయినా కేంద్ర ప్రభుత్వం కోరితే ఎపుడైనా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక ఆయన రాజీనామా చేసిన వెంటనే తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్న రవిని బెంగాల్ కొత్త గవర్నర్ గా నియమించారు. ఈ పరిణామాలు అన్నీ కొద్ది రోజుల క్రితం చకచకా సాగిపోయాయి.
పన్నెండు సెంచరీలు అంటూ :
ఇదిలా ఉంటే బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ కోల్ కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ తాను కరెక్ట్ గా 1200 రోజుల పాటు గవర్నర్ గా పనిచేశాను అన్నారు. క్రికెట్ పరిభాషలో చెప్పాలీ అంటే 12 సెంచరీలు అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అయితే తాను ఎందుకు ఆకస్మికంగా రాజీనామా చేయాల్సి వచ్చిందో అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అది సీక్రెట్ అని సంచనల కామెంట్స్ చేశారు. తగిన సమయం వచ్చే వరకు రాజీనామాకు గల కారణాలు గోప్యంగా ఉంటాయని ఆనంద బోస్ చెప్పడం విశేషం. అంటే రాజీనామా వెనక కారణాలు ఉన్నాయా ఉంటే అవి ఏమై ఉంటాయి అన్న చర్చ అయితే ఇపుడు సాగుతోంది.
వేదాంత ధోరణిలో :
ఎక్కడైనా ప్రవేశం ఉన్నచోట నిష్క్రమణ కూడా ఉంటుందని ఆనద బోస్ వేదాంత ధోరణిలో వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇక బెంగాల్ కి గవర్నర్‌గా ఇంతకలాం సేవలు అందించడం తనకు ఎంతో తృప్తిగా ఉందని అది తనకు చాలునని ఆయన అన్నారు. అంతే కాదు నిష్క్రమించడానికి ఇది సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
ఓటు వేసేందుకు వస్తా :
ఇదిలా ఉంటే బెంగాల్ గవర్నర్ రాజీనామా సడెన్ గా తీసుకుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే కేరళకు చెందిన ఆయన సరిగ్గా వారం రోజుల ముందే తన ఓటు హక్కుని బెంగాల్ కి మార్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇపుడు ఆయన మాజీ గవర్నర్ అయిపోయారు. దాంతో రాజీనామా చేశారు. అయితే ఓటు హక్కు విషయం మాత్రం ఆయన మరవలేదు, అందుకే పోలింగ్ సమయానికి ఓటు వేయడానికి తాను బెంగాల్ కి వస్తాను అని ఆయన చెప్పడం గమనార్హం.