వారి సంపాదనతోనే నేను లోకేష్ .... బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తన జీవిత సహచరి నారా భువనేశ్వరి మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.;
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తన జీవిత సహచరి నారా భువనేశ్వరి మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బాబు మహిళా శక్తి ఏ విధంగా ఉంటుందో చెప్పే క్రమంలో భువనేశ్వరి తన కుటుంబానికి ఏ విధంగా ఆర్ధిక శక్తిగా నిలిచిందో వెల్లడించారు. మహిళలకు స్పూర్తివంతంగా ఉండేలా బాబు ఈ విషయాలను వివరించడం జరిగింది.
వారు సంపాదిస్తున్నారు :
గత మూడు దశాబ్దాలుగా హెరిటేజ్ అనే సంస్థను అద్భుతంగా భువనేశ్వరి నడిపిస్తున్నారు అని చంద్రబాబు చెప్పారు. ఆమె నిబద్ధత కష్టంతో ఈ రోజు ఒక స్థాయికి చేరుకున్నారు అని అన్నారు ఆమె ఒక మంచి పారిశ్రామిక వేత్తగా మారారని చెప్పారు. హెరిటేజ్ సంస్థను సక్సెస్ ఫుల్ గా నడుపుతూ ఈ రోజున భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ తమ కుటుంబంలో సంపాదిస్తున్నారు అని చంద్రబాబు చెప్పారు. తమకు హెరిటేజ్ ద్వారానే డబ్బులు వస్తున్నాయని బాబు తెలిపారు. అందువల్ల తాము ఎక్కడా ఒక్క రూపాయిని ఆశించనక్కరలేదని బాబు చెప్పడం విశేషం. మహిళా పారిశ్రామికవేత్తలుగా నా భార్య, కోడలు సమర్థవంతంగా రాణిస్తున్నారు అని బాబు కితాబు ఇచ్చారు. అలా హెరిటేజ్ నుంచి వస్తున్న సంపాదనతో తాను లోకేష్ గౌరవంగా రాజకీయాలు చేస్తున్నామని అన్నారు. వారిలాగే ప్రతీ ఇంట్లోని ఆడబిడ్డ పారిశ్రామిక వేత్తలుగా ఉండాలనేది తన ఆకాంక్ష అని బాబు చెప్పారు.
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా :
ఇక ఈ ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడమే లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. గత ఏడాదిలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలు చేశామని చెప్పారు. ప్రతీ ఇంటి నుంచి ఒక ఎంఎస్ఎంఈ ఉండాలని, అందులో 50 శాతం మహిళలే ఉండాలన్నది తన ఆకాంక్ష అని బాబు అంటున్నారు
బాటలు వేసింది ఎన్టీఆర్ :
టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికే పనిచేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. మొదటగా ఆడవారికి తగిన న్యాయం చేసింది ఎన్టీఆరే అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలా సమాన హక్కు ఇచ్చారు. విద్యలో మహిళలను ప్రోత్సహించేందుకు పద్మావతీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని అన్నారు. అంతే కాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు.
మహిళలు సిద్ధంగా ఉండాలి :
ఇక చట్టసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయని ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు పోటీకి సిద్ధంగా ఉండాలని బాబు కోరారు. ఈ రోజున మగవాళ్ల కంటే ఎక్కువ ఆదాయం మహిళలు ఆర్జిస్తున్నారని ఆయన అనారు. 1997లో ఆడబిడ్డ పుడితే భారమనే రోజుల్లోనే ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం తెచ్చి వారి ఖాతాలో ఐదు వేల డిపాజిట్ చేశామని చెప్పారు. అలాగే పాఠశాలకకు వెళ్ళే విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించామని బాబు గుర్తు చేశారు.
60 కేజీల వరకూ రేషన్ :
ఉమ్మడి కుటుంబాలుగా అంతా ఉండాలని బాబు కోరారు. అలా ఉంటే కనుక ఆ కుటుంబానికి నెలకు 60 కేజీల వరకూ రేషన్ ఇచ్చే విషయం పరిశీలిస్తామని అన్నారు. మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని ఆయన గుర్తు చేశారు. దేశానికి ఉమ్మడి కుటుంబాలే అతి పెద్ద సంపద అన్నారు. అందువల్ల రేషన్, పెన్షన్, ఇంటి కోసం కుటుంబం విడిపోకూడదని ఆయన అన్నారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని బాబు చెప్పారు. అదనంగా పెన్షన్, కుటుంబాన్ని బట్టి డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా ఇస్తామని ఆయన ప్రకటించారు.