డీకేకు సీఎం పీఠం...సిద్ధరామయ్య వ్యాఖ్యల వెనక ?
కర్ణాటకలో రాజకీయం మారుతోంది. మరో పది రోజులలో ఉగాది పండుగ రాబోతోంది. ఈ ఉగాది తరువాత కర్ణాటకలో ముఖ్య మంత్రి పీఠం నుంచి ప్రస్తుత సీఎం సిద్దరామయ్య తప్పుకుంటారు అని అంటున్నారు;
కర్ణాటకలో రాజకీయం మారుతోంది. మరో పది రోజులలో ఉగాది పండుగ రాబోతోంది. ఈ ఉగాది తరువాత కర్ణాటకలో ముఖ్య మంత్రి పీఠం నుంచి ప్రస్తుత సీఎం సిద్దరామయ్య తప్పుకుంటారు అని అంటున్నారు. ఒక విధంగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరువాత అనుకోవాలి. దీనికి సంబంధించి పూర్వ రంగం అయితే కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధం చేసింది అని అంటున్నారు ఆ విషయం సిద్ధరామయ్యకు కూడా చేరవేయడంతో ఆయన తాజాగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు.
హైకమాండ్ దయ అంటూ :
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇప్పటికి మూడు బడ్జెట్లను ప్రజలకు అందించాను అని సిద్ధరామయ్య చెప్పారు అధినాయకత్వం కనుక అవకాశం ఇస్తే మరో రెండు బడ్జెట్ లను కూడా ప్రవేశపెడతాను అని ఆయన చెప్పేశారు. అంటే ఫుల్ టెర్మ్ సీఎం గా ఉండడానికి హై కమాండ్ అనుగ్రహం కావాలని ఆయన చెప్పకనే చెప్పారు అని అంటున్నారు. ఈ కీలక వ్యాఖ్యలు ఇపుడు కర్ణాటకలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి.
రెడీ అంటూ సంకేతమా :
ఇదిలా ఉంటే ఇప్పటిదాకా సిద్ధరామయ్య వర్గం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తమ నాయకుడు అయిదేళ్ళూ సీఎం గా ఉంటారు అని చెప్పుకొచ్చేవారు. ఇక హై కమాండ్ కూడా మధ్యలో మార్పులు ఎందుకు పెద్దాయనను కంటిన్యూ చేస్తే సరిపోతుంది అని ఒక దశలో అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కర్ణాటకలో మారుతున్న రాజకీయం డీకే వర్గంలో పెరుగుతున్న అసహనం అన్నీ కలసి కాంగ్రెస్ పెద్దల మనసు మార్చేశాయని అంటున్నారు. దాంతో పాటుగా సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ పెద్దలు ఆదేశిస్తే తాను గద్దె దిగేందుకు సిద్ధం అన్నట్లుగా సంకేతాలు ఇచ్చేశారు అని అంటున్నారు. అదే సమయంలో అవకాశం ఇస్తే మరో రెండు బడ్జెట్లు ప్రవేశపెడతాను అని కూడా అంటున్నారు.
ముహూర్తం ఫిక్స్ :
మొత్తానికి బంతిని మాత్రం కాంగ్రెస్ పెద్దల కోర్టులో వేశారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం కర్ణాటకలో జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే ఉగాది తరువాత కర్ణాటక అధికార పీఠం లో మార్పులు ఉంటాయని ఇది కాంగ్రెస్ తో పాటు బయట కూడా ప్రచారంలో ఉంది. దాంతో ఏదో జరగబోతోంది అన్నది అయితే అంతటా ఉత్కంఠగా మారింది.
ట్రబుల్ షూటర్ కి పగ్గాలు :
మరో రెండేళ్ళలో కర్నాటకలో అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. దాంతో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివ కుమార్ కి అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మూడేళ్ళ సిద్ధరామయ్య పాలన పట్ల ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా డీకే వంటి ఫ్రెష్ లీడర్ ని గద్దెనెక్కిస్తే ఎన్నికల వేళకు మళ్ళీ కాంగ్రెస్ కి పాజిటివ్ వేవ్ వస్తుంది అన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.
వీర విధేయులుగా :
ఇక సిద్ధ రామయ్య కానీ డీకే శివకుమార్ కానీ కాంగ్రెస్ అధినాయకత్వానికి వీర విధేయులుగా ఉంటున్నారు. డీకే తనకు సీఎం పదవి విషయంలో ఎక్కడా బయటపడడం లేదు, అలాగే సిద్ధ రామయ్య సైతం హైకమాండ్ ఏమి చెప్పినా ఎలా ఆదేశించినా రెడీ అని అంటున్నారు దీంతో సీఎం మార్పు అన్నది కర్ణాటకలో స్మూత్ గానే సాగుతుంది అని అంటున్నారు ఉగాది తరువాత మంచి రోజు చూసుకుని డీకేకు సీఎం పీఠం అప్పగించనున్నారు అన్నది అయితే గట్టిగా వినిపిస్తున్న ప్రచారం. చూడాలి మరి ఏమి జరుగుతుందో.