ఈ విధేయ‌త ఎన్న‌తర‌మా.. సేనానీ!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అంటే ప్రాణం పెట్టేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఉత్త‌రాదిలోని యూపీ, గుజ‌రాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్ర‌ధాని ప‌ట్ల ఆత్మీయ‌త చాటుకునే వారు ఉన్నారు.

Update: 2026-08-02 19:45 GMT

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అంటే ప్రాణం పెట్టేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఉత్త‌రాదిలోని యూపీ, గుజ‌రాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్ర‌ధాని ప‌ట్ల ఆత్మీయ‌త చాటుకునే వారు ఉన్నారు. కానీ.. వారెవ‌రూ సాటి రారు.. అన్న‌ట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం జ‌న సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎంచ‌డానికి వీల్లేని విధంగా ప్ర‌ధానిపై త‌న విధేయ‌త‌ను చాటుకుంటున్నారు. గ‌తంలో అయినా.. ప్ర‌స్తుతమైనా ప్ర‌ధాని మోడీ ప‌ట్ల ప‌వ‌న్ త‌న అభిమానం చాటుతూనే ఉన్నారు. 2018-19 మ‌ధ్య కాలంలో రాజ‌కీయంగా విభేదించిన‌ప్పుడు కూడా ఆయ‌న ప్ర‌ధానిపై ప‌న్నెత్తు మాట అన‌లేదు. కేవ‌లం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాన్ని మాత్ర‌మే త‌ప్పుబ‌ట్టారు.

అది కూడా వ్య‌క్తిగ‌తంగా కాదు.. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని మాత్ర‌మే ప్ర‌శ్నించారు. ఆత‌ర్వాత కాలం లో 2021 త‌ర్వాత‌.. నేరుగా బీజేపీతో స‌త్సంబంధాల‌ను మ‌రింత పెంచుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి అంచ‌లోనూ ప్ర‌ధానిపై అభిమానం చాటుతూనే ఉన్నారు. శ్రీశైలం వచ్చినా.. అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నుల పునః ప్రారంభానికి వ‌చ్చినా.. ఆత‌ర్వాత‌.. మ‌రో సంద‌ర్భంలో విశాఖ‌కు వ‌చ్చినా ప్ర‌ధానిపై త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఒకానొక ద‌శలో ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న స‌మ‌యంలో కూడా ప్ర‌ధాని హాజ‌రైన స‌భ‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఇరువురి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ అద్వితీయం. ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ప్ర‌ధాని ఓ చాక్లెట్ కూడా ఇచ్చారు.

ఇలా.. ప‌వ‌న్‌కు-మోడీకి మ‌ధ్య బంధం పెరిగేందుకు విధేయ‌త‌, విన‌శీల‌త‌లే కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది చాలా అరుదుగా.. అత్యంత త‌క్కువ మందికే ఉంటుంద‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, స‌నాత‌న ధ‌ర్మం పై ప‌వ‌న్ ఉద్య‌మించిన‌ప్పుడు.. ప్ర‌ధాని ఆయ‌నను ఆట‌ప‌ట్టించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. ''హిమాల‌యాల‌కు వెళ్తారా?'' అంటూ.. ప‌వ‌న్‌ను ఆయ‌న స‌ర‌ద‌గా ప్ర‌శ్నించారు. నిజానికి ప్ర‌ధాని ఇలా ఎవ‌రితోనూ వ్యాఖ్యానించిన సంద‌ర్భాలు లేవు. ఎంత అభిమానం ఉన్నా..నాయ‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఉంచుకోవాలో.. అంత వ‌ర‌కే ఉంచుతారు. ఇలా..పెన‌వేసుకున్న ఇరువురి బంధం.. ప‌వ‌న్ కు గాయ‌మైన‌ప్పుడు.. ప్ర‌ధాని హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌ల‌క‌రించేలా చేసింది.

తాజాగా భోగాపురం విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన స‌మ‌యంలోనూ ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేకంగా ప‌వ‌న్‌ను క‌లుసుకున్నారు. మాట్లాడించి మూడు నిమిషాలే అయినా.. ''చేతికి ఎలా ఉంది? జాగ్ర‌త్త‌.. విశ్రాంతి తీసుకోండి'' అంటూ.. ఓ తండ్రి మాదిరిగా ప‌వ‌న్‌కు జాగ్ర‌త్త‌లు చెప్ప‌డం.. ప‌క్క‌నే ఉన్న చంద్ర‌బాబును కూడా ఆశ్చ‌ర్యానికి, ఆనందానికి గురి చేసింది. అదే స‌మయంలో ప‌వ‌న్ చేతిలో చేయివేసిన ప్ర‌ధానికి చేయి బాగోక పోయినా.. అలానే త‌ల‌ను తాటించి.. అభివాదం చేయ‌డం.. గ‌మ‌నార్హం. అందుకే.. ''ఈ విధేయ‌త ఎన్న‌తర‌మా.. సేనానీ!'' అని జ‌న‌సేన నాయ‌కులు అచ్చ‌రువొందుతున్నారు.

Tags:    

Similar News