టీడీపీ వర్సెస్ వైసీపీ: సొంత నిర్ణయాలే చేటు తెస్తున్నాయా ..!
టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ. సో.. నాయకుల్లో కొంత మేరకు పదవులు దక్కలేదనో.. లేక ఆధిపత్య ఆకాంక్షలతోనో అసంతృప్తి నెలకొంది.
టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ. సో.. నాయకుల్లో కొంత మేరకు పదవులు దక్కలేదనో.. లేక ఆధిపత్య ఆకాంక్షలతోనో అసంతృప్తి నెలకొంది. దీనిని సరిచేసేందుకు పార్టీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. చిత్రంగా వైసీపీలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. పలు నియోజకవర్గాల్లో నాయకులు అసంతృప్తితో ఉన్నారు. గెలిచిన, ఓడిన ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా.. వైసీపీలోనూ నాయకులు అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
రెండు పార్టీల్లోనూ ఇదేతరహా రాజకీయాలు కనిపిస్తున్నాయి. టీడీపీ విషయానికి వస్తే.. పదవులు ఈ తరహా చర్చకు దారి తీస్తున్నాయి. తాము చెప్పిన వారికి కనీసం నామినేటెడ్ పదవులు కూడా దక్కడం లేదని వాపోతున్నవారు టీడీపీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో పాటు.. పొరుగు పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని.. పదవులు కట్టబెడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇప్పుడు నాలుగు గోడలు దాటి.. బహిరంగ వేదికలపైకి చేరుకుంది.
ఇక, వైసీపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను నియమిస్తూ.. ఇటీవల జగన్ నిర్ణయించారు. అయితే.. ఇలాంటి నియామకాలు చేపట్టేప్పుడు కనీసం తమకు ఒక్క మాట కూడా చెప్పడం లేదని సీనియర్ నాయకులు చెబుతున్నారు. తమకు ఎలాంటి ప్రమేయం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇలా అయితే.. ఎలా? అంటూ.. పార్టీ సీనియర్లను వారు ప్రశ్నిస్తున్నారు. గూడూరు, రేపల్లె సహా.. పలు నియోజకవర్గాల్లో పార్టీ ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటోంది.
అదేసమయంలో టీడీపీలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని.. సీనియర్లు వాపోతున్నారు. తమను సంప్రదించడం లేదని.. ఏ కార్యక్రమానికీ తమ ప్రమేయం ఉండడం లేదని చెబుతున్నారు. వైసీపీలోనూ ఇలానే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచనలు వినిపిస్తున్నాయి. కానీ, నేటి తరం ఆకాంక్షలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని పార్టీలు చెబుతున్నాయి. దీంతో ఈ గ్యాప్ పెరుగుతూ పోతోంది. దీనిని సరిచేయాలని నాయకులు కోరుతున్నారు. కానీ, సర్దుకుపోవాలని పార్టీలు చెబుతున్నాయి.