రోజా అరెస్టు: నేతల భిన్నాభిప్రాయాలు రీజనేంటి?
30 కోట్ల రూపాయల దుర్వినియోగం కేసులో వైసీపీ సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
30 కోట్ల రూపాయల దుర్వినియోగం కేసులో వైసీపీ సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే.. ఇది రెండు నెలల ముచ్చట. అప్పటి నుంచి కూడా కూటమి సర్కారు అడుగులు ముందుకు వేయలేక పోతోంది. వైసీపీ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి శాప్ చైర్మన్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మంత్రి రోజాలు.. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్నది అభియోగం.
ఆడుదాం ఆంధ్ర టైటిల్‌తో అమలు చేసిన కార్యక్రమం ద్వారా.. క్రీడాకారులకు పంపిణీ చేసిన పరికరా ల్లో నాసిరకమే ఎక్కువగా ఉన్నాయని, కానీ.. కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున సొమ్ము దోచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి. అదేసమయంలో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్న పేరుతోనూ దోచుకున్నార న్నది మరో ఆరోపణ. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మొత్తంగా ఈ వ్యవహారంలో 30 కోట్ల రూపాయల మేరకు దుర్వినియోగం జరిగాయని అధికారులు నివేదిక ఇచ్చారు.
ఇక, అప్పటి నుంచి రోజా, సిద్ధార్థరెడ్డి అరెస్టు వ్యవహారం తరచుగా మీడియా ముందుకు వచ్చింది. వీరిలో సిద్ధారెడ్డి విషయం పెద్దగా ప్రచారంలో లేకపోయినా.. మాజీ మంత్రి రోజా విషయంలో మాత్రం హాట్ కేకుల్లాంటి వార్తలు హల్చల్ చేశాయి. ఏ క్షణానైనా అరెస్టు చేస్తారని ప్రచారంలోకి వచ్చింది. అయితే.. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీనికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. రోజా నగరి నియోజకవర్గానికే పరిమితమైన నాయకురాలు కాదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమెను అరెస్టు చేస్తే.. వైసీపీకి అనవసరం గా సింపతీ ని తీసుకువచ్చినట్టు అవుతుందన్న అంచనాలు వున్నాయి. దీనికితోడు.. సినీ రంగంలోనూ రోజాకు సింపతీ ఉంది. అక్కడ కూడా ఇది చర్చ నీయాంశం అవుతుంది. పైగా.. రోజాను అరెస్టు చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా దీనిని వ్యతిరేక కోణంలో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంతోపాటు.. మహిళ అనే కోణంలో ప్రచారం చేసుకునేందుకు వైసీపీకి ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుందని నాయకులు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు కూటమి నాయకులే ఈ విషయంలో చర్యలు వద్దని సిఫారసు చేసినట్టు చెబుతున్నారు.
పైగా మెగా హీరో.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో అదే సినిమా రంగానికి చెందిన నటిని అరెస్టు చేస్తే(కారణాలు ఏవైనా కూడా) అది సరైన సంకేతాలు ఇవ్వదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలోచనలో పడిందని అంటున్నారు. మరి ఇది ఇక్కడితో ముగిసి పోతుందా? లేక.. మున్ముందు ఏమైనా చర్యలు ఉంటాయా ? అనేది చూడాలి. మరోవైపు.. రోజా ఈ పరిణామాలతో మౌనంగా ఉండడం గమనార్హం.