తెలంగాణా రాజ్ భవన్ వైపే అందరి చూపు
దేశంలో కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం మార్చింది. అందులో తొందరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉన్నాయి.;
దేశంలో కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం మార్చింది. అందులో తొందరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే తరువాత జరగబోయే రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ఈ భారీ చేంజిలో అందరినీ ఆకర్షించిన మరో విషయం తెలంగాణా గవర్నర్ మార్పు. జిష్ణు దేవ్ వర్మ గవర్నర్ గా వచ్చి ఎక్కువ కాలం కాలేదు, కానీ ఇంతలో అంత మార్పు దేనికి సంకేతం అన్నది హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. కొత్త గవర్నర్ గురించి కూడా వాకబు చేస్తున్నారు.
యూపీకి చెందిన నేతగా :
ఇక కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉత్తర ప్రదేశ్ కి చెందిన వారు. ఆయన బీజేపీలో చురుకైన నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. యూపీ మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయి మోడీ మొదటి విడత మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2023లో హిమాచల్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఇక మార్చి 5న ఆయన తెలంగాణా గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఆయన ఎంతో చురుకైన నేతగా గతంలో ఉండడంతో ఆయన నియామకం మీద రాజకీయంగా అంతా చర్చిస్తున్నారు.
రాజ్ భవన్ క్రియాశీలంగా :
గతంలో అందరికీ గుర్తుండే ఉంటుంది. బీఆర్ఎస్ పాలనలో తమిళ్ సై గవర్నర్ గా ఉండేవారు. ఆమె పూర్తి యాక్టివ్ గా ఉండేవారు. రాజ్ భవన్ ఆ సమయంలో కీలకంగా మారింది. గవర్నర్ ప్రజలతో మమేకం కావడం జిల్లాల పర్యటనలు చేయడం కూడా జరిగింది. ఇక ఆమె తరువాత జిష్ణు దేవ్ వర్మ అయితే అందరితో కలిసి మెలిసి ఉంటూ వచ్చారు. ఆయన హయాంలో అంతా ప్రశాంతంగానే జరిగిపోయింది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా తమిళనాడులో మాదిరిగా రాజ్ భవన్ నుంచి చిక్కులేవీ రాలేదు.
ఎన్నికల కోసమేనా :
తెలంగాణా అసెంబ్లీకి 2028 నవంబర్ లో ఎన్నికలు ఉన్నాయి. అయితే ఇప్పటికి రెండున్నరేళ్ళ ముందు నుంచే కేంద్రంలోని ఎన్డీయే కి నాయకత్వం వహిస్తున్న బీజేపీ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి అయితే రాజకీయంగా మాత్రమే బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. పాలనాపరంగా చూస్తే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిల మధ్య ఉండాల్సిన సంబంధాలను ఆయన అలాగే కొనసాగిస్తున్నారు. రాజ్యాంగపరంగా ఎలా ఉండాలో అలాగే చేసుకుంటూ వస్తున్నారు. అలా అంతా బాగానే సాగుతున్న వేళ రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ నియామకం ఏ పరిణామాలకు దారి తీస్తుంది అన్నదే అంతా చర్చిస్తున్నారు.
యాక్టివ్ గానేనా :
సాధారణంగా గవర్నర్లు రాజ్యాంగ రక్షకులుగా ఉంటారు ప్రభుత్వం పంపించే ఫైళ్లను చూసి అధికార ముద్ర వేస్తారు. అయితే క్రియాశీలకంగా పనిచేయాలనుకునే వారు మాత్రం అన్నీ గమనిస్తారు. ఒకటికి రెండు సార్లు పరికించి వెనక్కి తిప్పిన సందర్భాలు ఉంటాయి. దేశంలో ఇండియా కూటమి మిత్రుల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలలో సీఎం వర్సెస్ గవర్నర్లుగా ఎపిసోడ్ సాగుతున్న నేపథ్యం ఉంది. దాంతో యాక్టివ్ గా రాజ్ భవన్ పనిచేస్తే ప్రతిపక్షంలోని ప్రభుత్వాలకు అది ఇబ్బందికరమే అవుతుంది అని అంటున్నారు. రాజకీయంగా బాగా నలిగి వచ్చిన శివ ప్రతాప్ శుక్లా అయితే రాజ్ భవన్ లో యాక్టివ్ గా ఉండొచ్చు అంటున్నారు. గవర్నర్ నియమించాల్సిన ఎమ్మెల్సీల లిస్ట్ కి సంబంధించి ఫైల్ ఒకటి ప్రస్తుతం కొత్త గవర్నర్ పరిశీలనకు మొదట వచ్చేదిగా చెబుతున్నారు. దాని మీద శివ ప్రతాప్ శుక్లా ఏ నిర్ణయం తీసుకుంటారో దానిని బట్టి రాజ్ భవన్ ఏమి చేయబోతోంది అన్నది ముందు ముందు తెలుస్తుంది అని అంటున్నారు.