నితీష్ ఢిల్లీలో కాలు-తేజస్వి నెత్తిన పాలు

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఎన్డీయే కూటమి గెలిచింది.;

Update: 2026-03-08 16:30 GMT

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఎన్డీయే కూటమి గెలిచింది. 243 సీట్లలో 200కి పైగా సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంది. విపక్షంలోకి వచ్చిన ఆర్జేడీకి 30కి అటు ఇటుగా సీట్లు మాత్రమే దక్కాయి. జస్ట్ అలా ప్రతిపక్ష హోదా అయితే దక్కింది కానీ ఆర్జేడీ పని అయిపోయింది అన్న మాట వినిపించింది. అయితే కేవలం నాలుగు నెలల తేడాలో ఆర్జేడీ లేచి కూర్చుకునేలా ఎన్డీయే నేతల నిర్ణయాలు ఉంటున్నాయని అంటున్నారు.

మూడున్నర దశాబ్దాలుగా :

బీహార్ లో జాతీయ పార్టీలకు గుర్తింపు అయితే లేదు, అవి మనుగడ సాగించాలి అంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిందే. వాటి జట్టు కట్టాల్సిందే. దశాబ్దాల తరబడి బీహార్ ని ఏలిన కాంగ్రెస్ 1989లో ఓటమి పాలు అయింది. అది లగాయితూ మళ్ళీ గట్టిగా యాభై సీట్లు ఎపుడూ గెలుచుకున్న దాఖలాలు లేవు. జూనియర్ పార్టనర్ గా కాంగ్రెస్ మిగిలిపోయింది. బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ 2000 దాకా పెద్దగా పెర్ఫార్మ్ చేసింది లేదు. నితీష్ కుమార్ అనే బలమైన రాజకీయ నేత ఇమేజ్ తోనే బీజేపీ ఎదుగుతూ వస్తోంది. ఎంత చేసినా 243 సీట్లు ఉన్న సభలో బీజేపీ పూర్తి మెజారిటీకి ఎపుడూ చేరువ కాలేకపోతోంది.

పోటీ వారి మధ్యనే :

ఇక బీహార్ రాజకీయ ముఖ చిత్రం చూస్తే కనుక అవతల లాలూ ప్రసాద్ యాదవ్ ఇవతల నితీష్ కుమార్ ల మధ్యనే రాజకీయం మోహరించి ఉంది. లాలూ హవాను అడ్డుకున్న ఘనత కచ్చితంగా నితీష్ దే. బీహార్ ప్రజలు తమ బిడ్డగా నితీష్ ని భావిస్తారు, అందుకే ఆయన రెండు దశాబ్దాల పాటు సీఎం గా పని చేయగలిగారు. ఇక బీజేపీ కూడా నితీష్ నే నమ్ముకుని తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంది. జేడీయూలో కూడా నితీష్ వారసులు ఎవరూ లేరు. ఆర్జేడీలో లాలూ కుమారుడు బాగానే రాణిస్తున్నారు. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ కి రాజకీయంగా ఇంకా అరంగేట్రం లేదు అన్నది గుర్తు చేస్తున్నారు.

జేడీయూలో వ్యతిరేకత :

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలనుకోవడం పట్ల 85 మంది ఎమ్మెల్యేలు ఉన్న జేడీయూ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా వారికి నచ్చచెప్పేందుకు నితీష్ కుమార్ తన నివాసానికి పిలిపించి మీటింగ్ పెట్టారు. అయితే రాజ్యసభకు వెళ్ళొద్దు అని అనేక మంది నితీష్ కి సూచించారు. బీహార్ సీఎం గానే ఉంటూ పాలన చేయాలని కోరారు వారి మాటలను విన్న నితీష్ కుమార్ యాదవ్ తీవ్ర భావోద్వేగానికి గురు అయ్యారని అంటున్నారు.

క్యాడర్ ఆగ్రహం :

ఇక పాట్నాలో జేడీయూ క్యాడర్ అయితే నితీష్ సీఎం పదవికి రాజీనామా చేయాలనుకోవడం వెనక భారీ కుట్ర ఉందని మండిపడుతున్నారు. నితీష్ నే బీహార్ ముఖ్యమంత్రి అని వారు నినాదాలు చేస్తున్నారు. ఆయన సీఎం గా ఉండాలని పాట్నావ్యాప్తంగా పోస్టర్లు వేశారు. అదే సమయంలో బీజేపీ నేతల మీద జేడీయూ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. దీంతో ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.

ఆర్జేడీ హాట్ కామెంట్స్ :

బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్ళడం మీద ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ప్రాంతీయ పార్టీలను బీజేపీ లేకుండా చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీతో పొత్తు అంటే ఇదే పరిస్థితి ఉంటుందని మహారాష్ట్ర శివసేనను తమిళనాడులోని అన్నా డీఎంకేని అలాగే ఇతర పొత్తు పార్టీలను ఆయన ఉదహరించారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ పరిణామాలు ఆర్జేడీకి వరంగా మారుతాయా అన్న చర్చకు తెర లేచింది. బీహార్ వారు తన ప్రాంతీయ నేతకే పగ్గాలు అందిస్తారు. ప్రాంతీయ పార్టీలకే వారు గత మూడున్నర దశాబ్దాలుగా ఓటేస్తూ వస్తున్నారు. నితీష్ లేని జేడీయూ సైతం ఎలా ముందుకు సాగుతుందో తెలియని నేపథ్యంలో ఆర్జేడీ పుంజుకుంటుందా అన్న విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News