తెలంగాణ‌లో టీడీపీ ప‌ని అయిపోయింద‌ట‌

Update: 2017-11-17 10:20 GMT
2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో.. తెలంగాణ‌ రాజ‌కీయాలు  హాట్ హాట్‌ గా మారుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీగా ప్ర‌క‌టించుకున్న చంద్ర‌బాబు పార్టీ టీడీపీకి తెలంగాణ లో చావు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ వంటి కీల‌క నేత‌లు బాబుకు బై చెప్పి కేసీఆర్ కారెక్కేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇటీవ‌ల ఫైర్‌ బ్రాండ్ రేవంత్ రెడ్డి కూడా ఇటీవ‌ల బాబుకో న‌మ‌స్కారం అంటూ.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని - ఏకంగా రాహుల్ స‌మ‌క్షంలోనే మూడు రంగుల జెండాను భుజంపై ప‌రిచేసుకున్నారు. ఈ ప‌రిణాల‌తో ఇప్ప‌టికే బిక్క‌చ‌చ్చిపోయిన తెలంగాణ టీడీపీ.. తాజాగా మాజీ మంత్రి - టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు.. ఎలిమినేటి ఉమా మాధ‌వ‌రెడ్డి చేసిన కామెంట్‌ తో మ‌రింత‌గా దిగ‌జారిపోయిందా? అని అనిపిస్తోంది.

విష‌యంలోకి వెళ్తే.. నల్ల‌గొండ‌కు చెందిన ఉమా మాధ‌వ రెడ్డి గతంలో టీడీపీలో ఎంతో చురుకుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆమె ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇటీవ‌ల ఆమె పార్టీ మారుతున్నార‌నే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే, దీనిపై ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వ‌లేదు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆమె.. టీఆర్ ఎస్ అధినేత‌ - సీఎం కేసీఆర్‌ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప‌ని అయిపోయింద‌ని సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. దీంతో ఒక్క‌సారిగా తెలంగాణ టీడీపీ నేత‌లు ఖంగుతిన్నారు.

ప్ర‌స్తుతం తాను టీడీపీలోనే ఉన్నాన‌ని - అయితే, త్వ‌ర‌లోనే పార్టీ మార్పు ఖాయ‌మ‌ని ఉమా మాధ‌వ రెడ్డి చెప్పారు. ఇక‌, తాను కాంగ్రెస్‌ లో చేరుతున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆమె లైట్ తీసుకున్నారు. కాంగ్రెస్ నుంచి త‌న‌కు ఎలాంటి హామీ ల‌భించ‌లేద‌ని అన్నారు. ఒక‌వేళ ఏ మంత్రి లేదా మ‌రేదైనా ప‌ద‌వి విష‌యంలో హామీ ల‌భిస్తే.. త‌ప్ప‌కుండా పార్టీ మార్పుపై దృష్టి పెట్టేదానిన‌ని చెప్పుకొచ్చారు.  ఎలాంటి హామీ లేకుండానే కాంగ్రెస్ లో చేరడానికి తానేమన్నా పిచ్చిదాన్నా అని అన్నారు. హామీ ఇచ్చి ఉంటే రేవంత్ రెడ్డితో పాటే ఢిల్లీ విమానం ఎక్కి ఉండేదాన్నని చెప్పారు.  

ఇక‌, కేసీఆర్‌ ను తాను క‌ల‌వ‌డంపైనా ఉమా క్లారిటీ ఇచ్చారు.  నక్సలైట్ల చేతిలో మరణించిన నేతలకు ఇచ్చే ఫ్లాట్ కు సంబంధించి సీఎంకు వినతిపత్రం ఇచ్చిన‌ట్టు చెప్పారు. ఒంటరిగా కేసీఆర్ ను కలిస్తే టీఆర్ ఎస్ లో చేరుతున్నాననే ప్రచారం జరుగుతుందని... అందుకే సండ్ర వెంకటవీరయ్యతో కలసి వెళ్లానని, అందరూ చూస్తుండగానే ఆయనకు వినతిపత్రం అందించానని చెప్పారు. గ‌తంలో మంత్రిగా ఉన్న మాధ‌వ‌రెడ్డి న‌క్స‌లైట్లు ఏర్పాటు చేసిన మందుపాత‌ర పేలుడులో మృతి చెందారు.  ఇక‌, టీఆర్ ఎస్‌ లో చేరే అంశంపై మీడియా ప్ర‌శ్నించ‌గా.. ఆహ్వానం ఉంటే ఆలోచిస్తాన‌న్నారు.  ఏది ఎలా ఉన్నా.. టీడీపీలో అంగ‌రంగ వైభ‌వంగా ప‌ద‌వులు అనుభ‌వించిన నేత‌.. ఇప్పుడు ఆ పార్టీని చుల‌క‌న‌గా మాట్లాడ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 
Tags:    

Similar News