బ్రిటన్ సంచలన తీర్పు...ఆ 300 కోట్లు నిజామ్ వారసులవే

Update: 2019-10-02 16:05 GMT
దాయాదీ దేశం పాకిస్థాన్ కు ఇంటా బయట వరుస దెబ్బలు తగులుతున్నాయి. తనది కాని భూమి, డబ్బుపై తనదైన శైలి వాదనలు వినిపిస్తూ వస్తున్న పాక్ కు ఇప్పటికే చాలా దెబ్బలు తగిలాయి. తాజాగా మన హైదరాబాదీ మాజీ పాలకులు - నిజాం నవాబుల కుటుంబానికి చెందిన భారీ ధనాగారాన్ని కొట్టేసేందుకు యత్నించిన పాక్ పప్పులు ఉడకలేదు. బ్రిటన్ లో ఏళ్ల తరబడి సాగిన ఈ వివాదంలో నిజాం ఫ్యామిలీకి భారీ ఊరటనిచ్చే తీర్పును ఆ దేశ కోర్టు బుధవారం వెల్లడించింది. ఈ తీర్పుతో నిజాం వారసులుగా ఉన్న ముఖరం ఝా సోదరులకు ఏకంగా రూ.306 కోట్ల మేర నిధులు చేతికందాయి. సంచలనాలకే సంచలనంగా నిలిచిన ఈ కేసు తీర్పుతో ఇటు నిజాం ఫ్యామిలీతో పాటు నిజాం ఫ్యామిలీకి వెన్నంటి నిలిచిన భారత సర్కారు గొప్ప విజయం వరించగా - తనదైన తప్పుడు వాదనను వినిపిస్తూ వచ్చిన పాక్ భారీ షాక్ తగిలింది.

ఈ కేసు ఏమిటన్న విషయానికి వస్తే... 1947లో భారత్ కు బ్రిటిష్ పాలనను నుంచి విముక్తి లభించగా.. హైదరాబాద్ సంస్థానాన్ని ఇటు భారత్ లో విలీనం చేయడానికే కాకుండా పాక్ లో కలిసేందుకు కూడా నిర్ణయం తీసుకోని నిజాం నవాబు... హైదరాబాద్ ను ప్రత్యేక సంస్థానంగానే కొనసాగించారు. అయితే 1948లో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసేసింది. ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందుగా నాటి నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వద్ద ఉన్న 1 మిలియన్ పౌండ్ల (దాదాపుగా రూ.8.7 కోట్ల) మొత్తాన్ని బ్రిటన్ లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో పాక్ హైకమిషనర్ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలోకి జమ చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాక్ లో కలిపేస్తానన్న భావనతోనే ఆయన ఆ నిధులను పాక్ హైకమిషనర్ ఖాతాలోకి బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ ను భారత ప్రభుత్వం తనలో విలీనం చేసుకోగా... ఆ నిధులు తమకు చెందినవేనని, వాటిని తమకే ఇవ్వాలని నిజాం వారసులు కోరారు. అయితే అవి నిజాం నిధులు ఎంతమాత్రం కాదని, బ్రిటన్ లోని తమ హైకమిషనర్ ఖాతాలో ఉన్న సదరు నిధులు తమవేనని పాక్ వాదించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం బ్రిటన్ కోర్టుకు చేరింది.

కోర్టుకు చేరిన ఈ వివాదం 1948 నుంచి నిన్నటిదాకా తెమలకుండానే అలానే ఏళ్ల తరబడి కొనసాగింది. ఈ క్రమంలో ఇటు నిజాం వారసులకు భారత ప్రభుత్వం దన్నుగా నిలవగా... ఎలాగైనా ఈ నిధులను దక్కించుకునేందుకు పాక్ తనవంతు యత్నాలు చేసింది. విచారణల మీద విచారణలు సాగాయి. నిజాం నవాబు వారసుడు ముఖరం ఝా ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యాజ్యంలో... ఆయనకు 80 ఏళ్లు వచ్చాక గానీ ఇప్పుడు తీర్పు వచ్చింది. ఈ తీర్పులో బ్రిటన్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 1948లో నిజాం నవాబు పాక్ హైకమిషనర్ ఖాతాలో జమ చేసిన ఆ నిధులపై పాక్ కు ఎంతమాత్రం హక్కు లేదని, నిజాం నవాబు జమ చేసిన సదరు నిధులు ఆయన వారసులకే చెందినవిగా తేల్చి పారేసింది. ఈ తీర్పుతో నిజాం వారసులైన ముఖరం ఝా సోదరులకు రూ.306 కోట్ల నిధులు చేతికందనున్నాయి. నిజాం నవాబు నాడు ఒక్క మిలియన్ పౌండ్లు మాత్రమే జమ చేస్తే... కాలం అలా కరిగిపోతూనే ఉండగా... తీర్పు వెలువడే బుధవారం నాటికి ఆ నిధుల విలువ 35 మిలియన్ పౌండ్లకు చేరిపోయింది. ఈ లెక్కన బ్రిటన్ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో ముఖరం ఝా సోదరులకు ఇప్పుడు రూ.306 కోట్లకు పైగా భారీ మొత్తం చేతికందనుంది.



Tags:    

Similar News