అమెరికాలో స్నేహితులతో భోజనం చేస్తుండగా తెలుగు విద్యార్థి మృతి.. ఏం జరిగింది!
అయితే పవన్ కుమార్ మృతికి ఫుడ్ పాయిజనింగే కారణం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.;
ఇటీవల కాలంలో రకరకాల కారణాలతో (రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలు, దాడులు, కాల్పులు..) భారతీయులు చనిపోతున్న ఘటనలు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే! పైగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా స్నేహితులతో కలిసి భోజనం చేసుండగా.. ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అవును... అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి రాత్రి భోజనం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అతడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో.. అతన్ని హుటాహుటున ఆస్పత్రికి తరలించారు స్నేహితులు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అతడు మరణించాడనే వాదనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి!
వివరాళ్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి ఎం.ఎస్. డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ సమయంలో తన స్నేహితులతో కలిసి రాత్రి పూట భోజనం చేస్తుండగా.. సడన్ గా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అయితే పవన్ కుమార్ మృతికి ఫుడ్ పాయిజనింగే కారణం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే.. అమెరికా పోలీసు అధికారులు కానీ, వైద్య శాఖ అధికారులు కానీ పవన్ మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు ప్రాథమిక సమాచారం ప్రకారం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని అంటున్నారు. దీనిపైనా అధికారిక కన్ఫర్మేషన్ లేదు!
పవన్ కుమార్ రెడ్డి మరణ వార్తతో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త విన్న అనంతరం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలుగు విద్యార్థి సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యాయి. ఈ సమయంలో ఆయన భౌతికకాయాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధానంగా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మృతికి గల కారణాలను అధికారులు వెల్లడించనున్నారు. ఆ తర్వాత తదుపరి దర్యాప్తుపై ఓ క్లారిటీకి రావొచ్చని అంటున్నారు.
కాగా... ఈ నెల ప్రారంభంలో అమెరికాలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ విద్యార్థిని సహజ రెడ్డి ఉడుమల మరణించిన సంగతి తెలిసిందే. బాధితురాలు న్యూయార్క్ లోని అల్బానీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది.