తెలంగాణకు ఎప్పటికీ విలన్ చంద్రబాబేనా.. కేసీఆర్ కు మరో వ్యూహమే లేదా?

అయితే ఆ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు సాగడం, చంద్రబాబు ప్రస్తావన లేకపోవడం వల్ల కేసీఆర్ ఓడినట్లు భావిస్తున్నారని అంటున్నారు.;

Update: 2025-12-24 12:43 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రెండేళ్లకు మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ గా చేసిన విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా ఇరురాష్ట్రాల మధ్య నీటి పంపకాలు విషయంలో చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని, ఆయన వల్లే ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబడిపోయిందని కేసీఆర్ చేసిన విమర్శలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల నుంచి చంద్రబాబు వైదొలగిన 11 ఏళ్ల తర్వాత కూడా ఆయననే లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం వల్ల కేసీఆర్ ఏ ప్రయోజనం ఆశిస్తున్నారనేది ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. తాను మళ్లీ గెలవాలంటే చంద్రబాబును బూచిగా చూపాలన్న పాత సిద్ధాంతాన్నే కేసీఆర్ ఇప్పటికీ మేలైన అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారా? అంటూ చర్చించుకుంటున్నారు.

సీఎం చంద్రబాబును వ్యతిరేకిస్తూ సొంత పార్టీ పెట్టిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తో తెలంగాణలో తిరుగులేని నేతగా ఎదిగారు. పదేళ్ల పాటు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా.. ప్రత్యేక రాష్ట్రానికి పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు. ఉద్యమ సమయంలో చంద్రబాబును విలన్ గా చూపడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలను పొందిన కేసీఆర్.. సీఎంగా గెలిచిన తర్వాత కూడా చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించారని అంటున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయాలకు చంద్రబాబు దూరంగా ఉండిపోయారు. పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్.. తానుచేసిన కార్యక్రమాలను ఎక్కువగా ప్రచారం చేసుకోడానికే పరిమితమయ్యారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుపై చర్చ లేకుండానే రాజకీయం సాగింది.

అయితే ఆ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు సాగడం, చంద్రబాబు ప్రస్తావన లేకపోవడం వల్ల కేసీఆర్ ఓడినట్లు భావిస్తున్నారని అంటున్నారు. తెలంగాణలో చంద్రబాబు పేరు ప్రస్తావిస్తేనే తనకు రాజకీయంగా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఎన్నికలు ముగిసిన రెండేళ్ల వరకు ఆయన ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చంద్రబాబు శిష్యుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రచారం చేసి ఇబ్బందులు సృష్టించాలని చేసిన ప్రయత్నాల వల్ల పెద్దగా ప్రయోజనం లభించలేదని అంటున్నారు. దీంతో మళ్లీ తెలంగాణ రాజకీయ చర్చల్లోకి చంద్రబాబును లాగి.. ఆయన ద్వారా తాను లబ్ధి పొందాలని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు.

రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్.. తన వ్యూహంలో భాగంగానే చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యమిచ్చారని అంటున్నారు. అయితే కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ రాజకీయం కోసం అలా మాట్లాడుతున్నారని, ఆయన మాటలకు ప్రతిస్పందించడం ద్వారా కేసీఆర్ ఉచ్చులోకి వెళ్లకుండా ఉండాలని తన కేడర్ ను అప్రమత్తం చేశారని చెబుతున్నారు. ఈ కారణంగానే మాజీ సీఎం కేసీఆర్ చంద్రబాబుపైన, ఏపీపైన అక్కసు వెళ్లగక్కేలా మాట్లాడినా, టీడీపీ నుంచి ఎవరూ మాట్లాడలేదని విశ్లేషిస్తున్నారు. తాము మాట్లాడి కేసీఆర్ కు ప్రయోజనం కల్పించడం ఎందుకన్న ధోరణిని టీడీపీ నేతలు వ్యక్తం చేయడం చూస్తే.. కేసీఆర్ వ్యూహం అందరికీ తెలిసిపోయిందని అంటున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పుంజుకోవాలని ఆలోచనతో ఉన్న కేసీఆర్.. అందుకు తగ్గ వ్యూహాలు రచించలేకపోతున్నారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News