విజయనగరం రాజకీయాల నుంచి బొత్స తప్పుకున్నట్లేనా? జడ్పీ చైర్ పై బొత్స కూతురు!

గత మూడు దశాబ్దాలుగా విజయనగరం జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పుతున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. వచ్చే ఎన్నికల నాటికి అస్త్రసన్యాసం చేయాలనే ఆలోచన చేస్తున్నారా?;

Update: 2025-12-24 12:30 GMT

గత మూడు దశాబ్దాలుగా విజయనగరం జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పుతున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. వచ్చే ఎన్నికల నాటికి అస్త్రసన్యాసం చేయాలనే ఆలోచన చేస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో జిల్లా రాజకీయాల్లో బొత్స వారసులైన కూతురు, కొడుకు సందడి చేస్తుండటంతో బొత్స రిటైర్మెంట్ పై ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న బొత్స.. సొంత నియోజకవర్గం చీపురపల్లిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనట్లు ఇప్పుడు చీపురుపల్లిలో జరిగే ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. ఆయన రాలేని పరిస్థితుల్లో కూతురు లేదా కొడుకును పంపిస్తున్నారు. దీంతో బొత్స రాజకీయ వ్యూహంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాజకీయంగా ప్రస్తుతం బొత్స క్రియాశీలంగా ఉన్నా.. వచ్చే ఎన్నికల సమయం నాటికి ఆయన చురుకైన పాత్ర పోషించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే ముందస్తుగా వారసులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బొత్స కుటుంబం నుంచి అరడజను మంది జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. వీరికి తోడుగా యువతరం కూడా రంగ ప్రవేశం చేయడంతో బొత్స కుటుంబ రాజకీయ కార్యకలాపాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన బొత్స.. మళ్లీ అక్కడ నుంచి పోటీకి విముఖత చూపుతున్నట్లు చెబుతున్నారు. తన రాజకీయ జీవితంలో సీఎం తప్ప అని పదవులను అనుభవించిన తాను.. భవిష్యత్తులో రాజ్యసభలో అడుగుపెట్టడం ద్వారా ఆ అనుభవాన్ని సాధించాలని చూస్తున్నారని అంటున్నారు. గత ఎన్నికల సందర్భంగానే పోటీకి దూరంగా ఉండాలని భావించినప్పటికీ పార్టీ అధ్యక్షుడు జగన్ ఒత్తిడితో పోటీ చేయాల్సివచ్చిందని చెబుతున్నారు.

ఇక వచ్చే ఎన్నికల నాటికి 70 ఏళ్ల వయసు దాటిపోనుండటం వల్ల పోటీ నుంచి తప్పుకోవాలని బొత్స భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తనకు బదులుగా కొడుకు సందీప్ ను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని బొత్స డిసైడ్ అయ్యారంటున్నారు. గత ఎన్నికల్లోనే సందీప్ పోటీకి ఉత్సాహం చూపినా పార్టీ చాన్స్ ఇవ్వలేదని అంటున్నారు. అయితే ఇప్పుడు సందీప్ తోపాటు బొత్స కూతురు అనూష కూడా చీపురుపల్లిలో ఎక్కువగా తిరుగుతున్నారు. రాజకీయంగా తన ఆసక్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. దీంతో కూతురు, కుమారుడు మధ్య రాజకీయ విభేదాలు రాకుండా కూడా బొత్స ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల వరకు బొత్స స్థానికంగా అందుబాటులో లేని సమయంలో కూతురు లేదా కొడుకు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించేవారు. అయితే ఇప్పుడు బొత్స జోక్యంతో ఇద్దరూ ఒకే కార్యక్రమంలో మెరుస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

బొత్స వారసుడు సందీప్ రాజకీయ ప్రవేశానికి ఇబ్బంది లేకుండా కూతరు అనూషకు ప్రత్యామ్నాయం చూపేలా బొత్స ప్లాన్ చేసినట్లు సమాచారం. కుమారుడు సందీప్ కు తన స్థానంలో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం అప్పగించాలని భావిస్తున్న బొత్స.. కుమార్తె అనూషను కూడా అదే నియోజకవర్గం నుంచి జడ్పీటీసీగా పరిచయం చేసి జిల్లా రాజకీయాలలో తిప్పాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి జడ్పీటీసీగా అనూషను పోటీకి పెట్టి.. విజయనగరం జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించేలా బొత్స పావులు కదుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్ గా బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఈయనను వైసీపీ అధిష్టానం భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. దీంతో మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని అంటున్నారు.

దీంతో జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా బొత్స అనూషను ప్రకటించి కుమారుడికి అడ్డు లేకుండా చేయడంతోపాటు జడ్పీపీఠం తన కుటుంబంలోనే ఉండేలా బొత్స ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా బొత్స సతీమణి బొత్స ఝాన్సీ, అదే కుటుంబానికి చెందిన బడ్డుకొండ అప్పలనాయుడు జడ్పీ చైర్మన్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే బొత్స అనూషను జడ్పీ చైర్ పర్సన్ చేయాలని సత్తిబాబు వ్యూహాలు రచిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాలతో బొత్స వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News