షాకింగ్: నెలకు 10 లక్షల లైన్ల కోడ్ రాయాల్సిందేనా?

ఈ క్రమంలో ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల నిద్ర పోగొడుతోంది.;

Update: 2025-12-24 12:58 GMT

టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నామస్మరణే వినిపిస్తోంది. ఒకప్పుడు కేవలం ఒక ఆప్షన్ గా ఉన్న ఏఐ ఇప్పుడు టెక్ దిగ్గజాలకు తప్పనిసరి మార్గంగా మారింది. ఈ క్రమంలో ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల నిద్ర పోగొడుతోంది.

ఏమిటా నిర్ణయం..? ఎందుకీ మార్పు?

సాఫ్ట్ వేర్ భద్రత , పనితీరు మెరుగుదల కోసం మైక్రోసాఫ్ట్ తన కోడింగ్ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ దశాబ్ధాలుగా ఉపయోగిస్తున్న సీ, సీ++ భాషల స్థానంలో అత్యంత సురక్షితమైన ‘రస్ట్’ భాషలోకి తన మొత్తం కోడ్ బేస్ ను మార్చాలని నిర్ణయించింది. మెమరీ సేఫ్టీ విషయంలో ‘రస్ట్’ భాషకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా భవిష్యత్తులో ఏఐ అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ ను తీర్చిదిద్దేందుకు ఈ రీరైట్ ప్రక్రియను కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

షాకింగ్ టార్గెట్.. నెలకు 10 లక్షల లైన్ల కోడ్

ఈ మార్పు వినడానికి బాగున్నా దీని వెనుక ఉన్న పనిభారం మాత్రం అసాధారణంగా ఉంది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కోడ్ కన్వర్షన్ ప్రక్రియలో భాగంగా ఇంజినీర్లు నెలకు దాదాపు 10 లక్షల లైన్ల కోడ్ రాయాల్సి రావచ్చు. అంటే రోజుకు వేల సంఖ్యలో లైన్లను కన్వర్ట్ చేస్తూ టెస్టింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. కేవలం కోడ్ రాయడమే కాకుండా పాత కోడ్ లోని లాజిక్ దెబ్బతినకుండా కొత్త భాషలోకి మార్చడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ‘ఏఐ యుగంలో కోడింగ్ అంటే కేవలం స్కిల్ మాత్రమే కాదు.. అది ఒక శారీరక , మానసిక సహన పరీక్షగా మారుతోంది’ అనేది టెక్ విశ్లేషకుల అభిప్రాయం

ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన..

ఇప్పటికే టెక్ రంగంలో లేఆఫ్స్ భయాలు, పెరుగుతున్న పనిభారం వంటి సమస్యలతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్ పెట్టిన ఈ ‘మెగా టార్గెట్’ వారిపై తీవ్రమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. అయితే ఏఐ యుగంలో సెక్యూర్ , ఫ్యూచర్ ఫ్రూఫ్ సాఫ్ట్ వేర్ కోసం ఈ కఠినమైన మార్పు తప్పనిసరి అని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం భావిస్తోంది.

టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఉద్యోగులు కూడా తమ వేగాన్ని పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లు ఈ అసాధ్యమైన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారో.. ఈ మార్పు టెక్ ప్రపంచంలో ఎలాంటి కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News