అది పద్మశ్రీ సిఫార్సుకు కాదు.. రఘురామపై సునీల్ ఘాటు వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు – సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వార్ ఆఫ్ వర్డ్స్ రోజు రోజుకీ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తుంది.;
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు – సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వార్ ఆఫ్ వర్డ్స్ రోజు రోజుకీ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తుంది. సునీల్ వ్యవహారం కోర్టులో ఉండగా.. రఘురామ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ కాస్తా చినికి చినికి గాలివానగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలో సునీల్ నుంచి మరో వైరల్ వీడియో తెరపైకి వచ్చింది.
అవును... ఇటీవల రఘురామ కృష్ణంరాజు కుటుంబం బ్యాంకులను మోసం చేసిందని, అందుకే సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. లో 420 సెక్షన్ తో కేసు నమోదు చేసిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పీవీ సునీల్ కుమార్.. తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ఇటీవల సునీల్ తీరుపై అభ్యతరం వ్యక్తం చేస్తూ ఏపీ డీజీపీకి రఘురామ లేఖ రాశారు.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు! దీంతో.. ఆ లేఖను ముందేసుకున్న సునీల్.. ఒక్కో పాయింటుకు సమాధానం చెప్పుకుంటూపోయారు!
ఈ లేఖ రాశారన్న విషయం తెరపైకి రాగానే... ఉత్తరాల ఉత్తర కుమారుడికి ఎవడూ భయపడడు.. ఉత్తరం చదివి సరైన సమాధానం చెబుతా.. ఎదురు చూస్తుండాలని పోస్టు పెట్టారు సునీల్ కుమార్! అన్నట్లుగానే తాజాగా దస్తాల దస్తాల పేపర్లు తీసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఇందులో ప్రధానంగా.. తనపై ఏపీ డీజీపికి రఘురామ రాసిన లేఖను ముందుగా ఓపెన్ చేసి.. అందులోని అంశాలపై స్పందించడం మొదలుపెట్టారు.
* తనపై సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. మాత్రమే నమోదు చేసిందని.. తనకు ఇంకా శిక్ష పడలేదని.. అలాంటప్పుడు శిక్ష పడుతుందని సునీల్ చెప్పడం సరైంది కాదని రఘురామ డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారని సునీల్ పేర్కొన్నారు.
దీనికి సమాధానంగా స్పందించిన సునీల్... బహుశా మీరు మరిచిపోయారేమో.. తనతో పాటు మాదిగ సోదరుడు, క్రీస్టియన్ విజయ పాల్, కాపు సోదరి డాక్టర్ ప్రభావతి, గిరిజన సోదరుడు సునీల్ నాయక్ పై కస్టోడియల్ టార్చర్ కేసు పెట్టారు.. అదేమైనా నిరూపితమైందా.. అలాంటప్పుడు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడారు? వాళ్లు అరెస్ట్ అవుతారు, వీళ్లు అరెస్ట్ అవుతారంటూ చాలాసార్లు మీడియాలో ఎందుకు మాట్లాడారు అని రఘురామను ప్రశ్నించారు.
* క్రిమినల్ డెఫమేషన్ వేస్తానని రఘురామ హెచ్చరించారని సునీల్ పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి.. క్రిమినల్ డెఫమేషన్ వేసుకోవాలని సూచించారు.. తనపై మాట్లాడినవీ ఉన్నాయని.. వాటిపైనా నష్టపరిహారం కేసు వేస్తానని చెప్పారు. మీకేమి న్యాయం జరుగుతుందో.. నాకూ అదే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు సునీల్ కుమార్.
* ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సునీల్ తెలిపారు.
దీనిపై స్పందిస్తూ... తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినంత మాత్రాన్న ఆంధ్రప్రదేశ్ పౌరుడిని కాకుండా పోనని.. ఇదే సమయంలో.. బ్యాంకులో తాను డిపాజిట్లు చేశానని.. అందువల్ల తనకు మాట్లాడే హక్కు ఉందని.. తనలాంటి వారు డిపాజిట్లు చేసిన సొమ్మునే బ్యాంకులు మీకు అప్పుగా ఇచ్చాయని సునీల్ వ్యాఖ్యానించారు!
* ఇదే సమయంలో.. విచారణాధికారిపై ఒత్తిడి చేశారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారని సునీల్ వెళ్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన దీన్ని పెద్ద కామెడీగా అభివర్ణించారు. మీ కేసు గురించి ఎన్నిసార్లు మీరు బహిరంగంగా మాట్లాడలేదని సునీల్ ప్రశ్నించారు. టీవీల్లోనూ, యూట్యూబ్ లోనూ, పత్రికల్లోనూ మీ ఇష్టం వచ్చినట్లు తాగి (అదే.. మంచినీళ్లు) మాట్లాడొచ్చు కానీ.. ఇంకెవరూ మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. మీరు ఎంతమంది సాక్ష్యులను బెదిరించారని సునీల్ ప్రశ్నించారు.
* మీడియా ట్రైల్ చేస్తున్నట్లుగా ఉందని రఘురామ పేర్కొన్నారని సునీల్ తెలిపారు.
ఈ సందర్భంగా స్పందిస్తూ... ఇది చాలా నవ్వులాటగా ఉందని.. అసలు మీరు మీడియా ట్రైల్స్ గురించి మాట్లాడటం ఏమిటని రఘురామను సునీల్ ప్రశ్నించారు. మీరు పొద్దున్న లేస్తే మీడియాలో మాట్లాడుతూనే ఉంటారు కదా అని అన్నారు. మీరు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే ఇంకోటి అన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా రఘురామను 420 అని తాను అనలేదని.. సీబీఐ ఆ విధంగా గుర్తించిందని.. మోసం చేశారు అనేందుకు ఆధారాలన్నీ పెట్టుకుని, అదేదో పద్మశ్రీకి సిఫార్సు చేసినట్లు, సత్కారాలు జరిగినట్లు మాట్లాడటం సరైందా అని ప్రశ్నించిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్.. తన దగ్గర బెదిరింపులు పనిచేయవని అన్నారు.