చివరి నిమిషంలో చాన్స్ కోల్పోయిన కొమ్మాలపాటి.. పల్నాడు టీడీపీలో ఇంట్రస్టింగ్

టీడీపీలో జిల్లా అధ్యక్షుల నియామకంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన జిల్లా అధ్యక్ష పదవుల కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారని అంటున్నారు.;

Update: 2025-12-24 13:30 GMT

టీడీపీలో జిల్లా అధ్యక్షుల నియామకంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన జిల్లా అధ్యక్ష పదవుల కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారని అంటున్నారు. అధిష్టానం కూడా కొందరికి జిల్లా పగ్గాలు అప్పగిస్తామని హామీ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఏం జరిగిందో కానీ, చివరి నిమిషంలో కొందరు ముఖ్యమైన నాయకుల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయి. తొలి నుంచి జిల్లా అధ్యక్షుడిగా ప్రచారంలో ఉన్న నేతల పేర్లు ఎలా తప్పిపోయాయి? కొత్తవారి పేర్లు ఎలా తెరపైకి వచ్చాయనే చర్చ ప్రధానంగా సాగుతోంది.

రెండు రోజుల క్రితం టీడీపీ జిల్లా అధ్యక్ష పదవులను అధిష్టానం ఖరారు చేసింది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొందరు సీనియర్ నేతలకు జిల్లా పార్టీ పగ్గాలను అప్పగించారు. అయితే కొందరు చివరి నిమిషంలో అవకాశాన్ని చేజార్చుకున్నారని అంటున్నారు. అలాంటి వారిలో పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని చెబుతున్నారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కొమ్మాలపాటికి అవకాశం దక్కనుందని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొమ్మాలపాటి గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేశారు. ఇలా సీట్లను కోల్పోయిన వారిలో చాలా మందికి నామినేటెడ్ పదవులను కేటాయించారు. కానీ, కొమ్మాలపాటికి ఇంతవరకు ఎలాంటి పదవి దక్కలేదు.

ఈ పరిస్థితుల్లో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటిని నియమిస్తారనే ప్రచారం ఆసక్తి రేపింది. కానీ, జిల్లా అధ్యక్షుల ప్రకటనలో కొమ్మాలపాటి పేరు మాత్రం కనిపించలేదు. ఆయన స్థానంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా షేక్ జాన్ సైదాను నియమించారు. మైనార్టీ కోటాలో చివరి నిమిషంలో సైదాను నియమించాల్సివచ్చిందని పార్టీ చెబుతున్నప్పటికీ, కొమ్మాలపాటిని తప్పించడమే సందేహాలకు కారణమవుతోంది. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీకి అవకాశం ఇవ్వాలని అనుకున్నా, ఆయనపై సానుకూల లేకపోవడం వల్ల ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి అవకాశం ఇచ్చారని అంటున్నారు. నంద్యాల బదులుగా పల్నాడుకు మైనార్టీ నేతను ఎంపిక చేశారని పార్టీ అధిష్టానం పెద్దలు చెబుతున్నారు.

అయితే, పార్టీ పెద్దలు చెబుతున్న కారణాలను స్థానికంగా కొందరు కార్యకర్తలు విశ్వసించడం లేదని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే కొమ్మాలపాటిని తప్పించారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పడంతోనే చివరి నిమిషంలో కొమ్మాలపాటికి జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారని అనుమానిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన నుంచి కొమ్మాలపాటిపై అనేక విమర్శలు వస్తున్నాయని, ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం వల్ల సీనియర్ నేత కొమ్మాలపాటి చాన్స్ కోల్పోయారని అంటున్నారు.

Tags:    

Similar News